World Environment Day 2021: ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతిని ప్రేమించండి.. లేకుంటే..?

శనివారం, 5 జూన్ 2021 (09:25 IST)
World Environment Day 2021
ప్రకృతిని ప్రేమిస్తే.. అది మానవునికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ప్రకృతి అవసరం మనిషికి ఎంతో వుందన్న విషయాన్ని గ్రహించిన మానవ జాతి.. ఆ ప్రకృతిని స్వార్థం కోసం వాడుకుంటోంది. ఫలితం ప్రకృతీ వైపరీత్యాలు, అంటు వ్యాధులు ఏర్పడుతున్నాయి. అందుకే పర్యావరణాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ.. పర్యావరణ పరిరక్షణ ముఖ్యమని చెప్తూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జూన్ 4వ తేదీన జరుపుకుంటున్నారు. 
 
పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే.. మానవుడు వాతావరణంలో ఏర్పడే మార్పులకు తలొగ్గాల్సిందేనని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రపంచానికి మూలం ప్రకృతి. ఆ ప్రకృతిని కాపాడాలంటే పర్యావరణ పరిరక్షణకు గుర్తుంచుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
మానవుడు మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పుతున్నాడు. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. 
 
నేటి వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ, ఇంధనకొరతకి, వాతావరణ కాలుష్యానికి కారణం అవుతున్నాము . కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది.
World Environment Day 2021
 
ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన స్థాపించబడింది. పర్యావరణ దినం సందర్భంగా, ఈ సంవత్సరం జూన్ 5న చైనా లో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ సమావేశంలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించటమేగాకుండా, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు. 
 
1972వ సంవత్సరంలోనే స్థాపించబడిన "ఐక్యరాజ్యసమితి పర్యావరణ పథకం", ఇదే వేదికను ఉపయోగించుకుని పర్యావరణానికి సంబంధించి.. రాజకీయాల్లోని వారికి, ప్రజలకు అప్రమత్తతను పెంచటానికి పనిచేస్తూనే వుంది. 1972వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. అందుచేత పంచభూతాలను, పకృతిని ప్రేమిస్తే.. పర్యావరణాన్ని మనం కాపాడుకున్నట్టే. గాలి, నీరు కలుషిత రహితంగా వుండాలంటే.. మానవుడు ప్రకృతి పట్ల స్వార్థంగా వుండటం మానుకోవాలి. ప్రకృతిని కాపాడుకోవాలి. చెట్లను నాటాలి. భావితరాలకు కలుషిత రహిత పర్యావరణాన్ని అందించేందుకు పాటుపడాలి.!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు