సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. కనీసం పరువు నిలుపుకునేందుకు కొన్ని సీట్లయినా కైవసం చేసుకునేందుకు రఘువీరా రెడ్డి తంటాలు పడుతున్నారు. చిరంజీవి కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం సీమాంధ్రకు మరో ఇద్దరు హీరోయిన్లు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు రంగంలోకి దిగబోతున్నారట.
ఒకరు గ్యాంగ్ లీడర్ హీరోయిన్ అయితే మరొకరు ఘరానా మొగుడు చిత్రంలో నటించిన హీరోయిన్. వీరిద్దరూ ఎవరనుకుంటున్నారా...? గ్యాంగ్ లీడర్ చిత్రంలో చిరంజీవితో రఫ్ ఆడించుకున్న విజయశాంతి ఒకరయితే, ఘరానా మొగుడు చిత్రంలో చిరు పాత్ర రాజును... రాజా గాజా అంటూ ఎడమచేత్తో చిటికెలు వేసిన నడుము అందాల నగ్మా. వీరిద్దరూ త్వరలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కసరత్తు జరుగుతుంది.
చిరంజీవి వెంట ఈ హీరోయిన్లిద్దరూ ప్రచారం చేస్తారని అంటున్నారు. ఇప్పటికే రాములమ్మ తెలంగాణలో ప్రచారం చేస్తూ యమ బిజీగా ఉండగా, మీరట్ నియోజకవర్గంలో వివాదాలతో ముందుకు పోతున్న నగ్మా కూడా ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా హంగామా చేస్తోంది. మరి వీరిద్దరూ సీమాంధ్రలో చిరంజీవితో కలసి ప్రచారం చేస్తుంటే... ఎలా ఉంటుందో చూడాల్సిందే.