మష్రూమ్‌ పనీర్‌ మసాలా ఎలా తయారు చేయాలో తెలుసా?

మంగళవారం, 15 జనవరి 2013 (18:29 IST)
FILE
మష్రూమ్, పనీర్‌లో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి. వీటిని తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరగడంతో పాటు ఎనర్జీ లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుచేత మీ పిల్లలకు నచ్చే విధంగా మష్రూమ్ ఫ్రై, పనీర్ ఫ్రైతో కాకుండా మసాలా కలిపి ట్రై చేసి చూడండి. మష్రూమ్ పనీర్ మసాలా ఎలా తయారు చేయాలంటే..?

కావలసిన పదార్ధాలు :
మష్రూమ్స్‌ : 200 గ్రాములు
ఉల్లిపాయలు: అర కప్పు
పచ్చి మిర్చి : రెండు టీ స్పూన్లు
ధనియాల పొడి : రెండు టీ స్పూన్లు
గరం మసాలా పొడి : ఒక టీ స్పూన్
కొబ్బరి పొడి : నాలుగు టీ స్పూన్లు
పన్నీర్ : 200 గ్రాములు
పసుపు : అర టీ స్పూన్
అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ : అరకప్పు
ఉప్పు : తగినంత
జీలకర్ర : రెండు టీ స్పూన్లు
ఆవాలు : పోపుకు తగినన్ని
నూనె : తగినంత
కొత్తిమీర : గార్నిష్‌కు

తయారీ విధానం:
ముందుగా మష్రూమ్స్‌ను శుభ్రం చేసి, ఉడికించి రెండేసి ముక్కలు చేసుకోవాలి. పనీర్‌ను తురుముకోవాలి. బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కూడా చేర్చి దోరగా వేపాలి.

ఇంకా అందులో పచ్చి మిర్చి, మష్రూమ్స్‌, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసి రెండు నిమిషాలు వేయించాలి. తర్వాత తురిమి పెట్టుకున్న పనీర్‌ వేసి కలపాలి. పనీర్‌ వేసి గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమంలో ధనియాల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలియతిప్పాలి. చిక్కబడ్డాక కొత్తిమీరతో అలంకరించుకుని చపాతీలు, రోటీలు, నేతి అన్నం, పులావ్‌లకు సైడిష్‌గా వాడుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి