రోడ్లపై పానీ పూరీ ఎందుకు? ఇంట్లోనే చేసుకోవచ్చు కమ్మగా... ఇలా....

మంగళవారం, 20 జూన్ 2017 (16:14 IST)
పూరీ : ముందుగా ఒక గిన్నెలో అరకప్పు బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్ మైదాపిండి, సరిపడినంత ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత కొద్దిగా కొద్దిగా నీటిని కలుపుతూ ముద్దగా చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాల పాటు ఆ ముద్దను తడిగుడ్డలో చుట్టి ఉంచాలి, ఇలా చేస్తే రవ్వ నీటిని పీల్చుకుని పిండి మృదువుగా మారుతుంది. తర్వాత కొంత పిండిని ఉండలుగా చేసి చపాతీలాగా రుద్ది దానిలో ఏదైనా మూతతో చిన్నవిగా కట్ చేసుకోవాలి. పెనంలో నూనె కాగిన తర్వాత వాటిని బంగారురంగు వచ్చే వరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
 
స్టఫింగ్ కోసం: ఒక గిన్నెలో బాగా ఉడకబెట్టి పొట్టు తీసిన బంగాళాదుంప, ఉడికించిన పచ్చిబఠాణీలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కాస్త కారం పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి మిశ్రమంగా కలుపుకుని ఉంచుకోవాలి.
 
పానీ: గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా ఆకులు, అల్లం, పచ్చిమిర్చి వీటిని మిక్సీలో వేసి కొంత నీటిని కలిపి ద్రవం లాగా చేసుకోవాలి.
 
పూరీని తీసుకుని బొటన వేలితో ఒక రంధ్రంలా చేసి, స్టఫింగ్ కోసం చేసుకున్న మసాలాను పెట్టి, కాస్త ఉల్లిపాయలు, కారప్పూస చల్లుకోవాలి. తర్వాత, తయారుచేసుకున్న పానీ అందులో పోయాలి. అంతే పానీపూరీ సిద్ధమైనట్లే. మీరు కావాలనుకుంటే చింతపండుతో కూడా పానీ తయారుచేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి