ఫెంగ్‌షుయ్‌ చిట్కాలతో కంటినిండా నిద్ర!

మంగళవారం, 12 ఆగస్టు 2014 (18:37 IST)
సాధారణంగా చాలా మంది రాత్రి పూట నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉండవచ్చు. మనసులో అలజడి, ఒత్తిడి, అలసట, ఆందోళనలు ఓ రకమైన కారణమైతే ఏవో కనిపిస్తున్నట్టు, తిరుగుతున్నట్టు ఊహించుకుంటూ నిద్రకు దూరమవడం మరో కారణంగా చెప్పవచ్చు. అయితే ఈ సమస్యను అధిగమించాలంటే ఫెంగ్‌షూయ్ మార్గాలను అనుసరించి చూడండి.
 
ముందుగా మీరు నిద్రించే మంచం గోడకు ఆనుకుని ఉందా అని గమనించండి. గోడ నుంచి ఓ అడుగు దూరంలో మంచాన్ని అమర్చుకోండి. అంతేకాకుండా మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాలను బెడ్‌రూంలో ఉంచుకోండి. తద్వారా మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అంతేకాకుండా మీ బెడ్‌ కనిపించేలా ఎదురుగా డ్రెస్సింగ్ టేబుల్, అద్దాలు వంటివి ఉంచకండి.
 
మీ ఇష్ట ప్రకారం ఓ విండ్‌చిమ్‌ను బెడ్‌రూంలో తగిలించండి. లేదంటే నైరుతి మూల వైపు ఓ క్రిస్టల్‌ను ఉంచండి. ఇవి ఉంచడం ద్వారా మీ మనసు ఆహ్లాదంగా ఉంటుంది. గాలి బాగా రావాలని చాలా మంది మంచాలను కిటికీ, తలుపులకు దగ్గరగా వేసుకుంటారు. అయితే దీన్ని ఫెంగ్‌షుయ్ తప్పుగా పరిగణిస్తుంది. కిటికీలకు, తలుపులకు దూరంగా మంచాన్ని వేసుకోవాలి. 
 
అంతేకాకుండా మీకు నచ్చిన మంద్రమైన సంగీతం మీ చెవులను తాకే విధంగా ఏర్పాటు చేసుకోండి. అలా చేయడం ద్వారా మనసు హాయిగా నిద్రపోతుంది. అలాగే జలపాతాల చప్పుడు, అలల శబ్దాలను వింటూ ఉంటే మనసుకు విశ్రాంతి కలిగి నిద్రలోకి జారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెడ్ లైట్లకు ఎర్ర లైట్లు వాడే బదులు పసుపు, ఆకుపచ్చ, నీలం రంగుల బల్బులను వాడండి. 

వెబ్దునియా పై చదవండి