ఫెంగ్‌షూయ్ ప్రకారం ఫొటోల అమరిక!

శనివారం, 9 ఆగస్టు 2014 (12:07 IST)
మనకు ఇతరులతో ఉన్న ప్రేమ, స్నేహం, ఆప్యాయతలకు చిహ్నంగా రకరకాల ఫొటోలను పెడుతుంటాం. అయితే ఫెంగ్‌షూయ్ ప్రకారం ఎలాంటి ఫొటోలు ఏ ప్రాంతంలో, ఏ దిక్కులో పెట్టాలో ఎవరికీ అంత స్పష్టంగా తెలీదు కదా. గృహాల నిర్మాణం, వస్తు అమరికల గురించి తెలుసుకున్నట్టే కుటుంబ సభ్యుల ఫొటోల విషయంలో పాటించాల్సిన అంశాలను తెలుసుకుందాం...
 
గృహంలో పడమటి దిక్కున ఉన్న ప్రాంతాలు పిల్లలకు మరియు సృజనాత్మకతలకు చిహ్నాలు. కాబట్టి ఆ ప్రాంతంలో పిల్లల చిత్రాలను పెట్టండి. తద్వారా వారి శక్తిని పెంచినవారవుతారు. అలాగే కుటుంబ సభ్యుల ఫోటోలను హాల్లో నైరుతి దిశలో మాత్రమే పెట్టడం ద్వారా మీ కుటుంబ సభ్యులకు సుఖ, సంతోషాలను అందించిన వారవుతారు. 
 
మీ ఇంటి యజమాని చిత్రాన్ని రెడ్‌ఫ్రేమ్‌తో తయారు చేసి దక్షిణం వైపుగా ఉంచినట్టైతే, ఇంటి యజమాని పేరు, ప్రఖ్యాతులు పెరుగుతాయి. అలాగే మీ బాస్, మీకు సాయం చేసే వారి ఫొటోలను నైరుతి దిక్కున ఉంచితే వారి సహకారం ఎప్పుడూ అందుతూ ఉంటుంది. పొరపాటున కూడా దక్షిణం వైపు ఎప్పుడూ నీలం రంగు ఫొటోలను పెట్టకండి. 
 
అగ్నికి, నీటికి సంఘర్షణ జరుగుతుంది కనుక ఈ దిశలో నీలం రంగు ఫొటోలను పెట్టడం మంచిది కాదని గుర్తుంచుకోండి. ఈ దిశలో ఫోనిక్స్ చిత్రాలను పెట్టడం ద్వారా మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఆగ్నేయంలో పచ్చిక బయళ్లతో కూడిన చిత్రాలను పెట్టడం ద్వారా సంపాదన పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఎందుకంటే ఆగ్నేయం సంపాదనకు ప్రతీక.

వెబ్దునియా పై చదవండి