'రక్షాబంధన్' ఎలా ప్రారంభమైందో మీకు తెలుసా..!?

బుధవారం, 10 ఆగస్టు 2011 (14:43 IST)
FILE
'రక్షాబంధన్' రాఖీ పండుగ ఎలా ప్రారంభమైందంటే.. పూర్వం దేవతలకు-రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి'లో తలదాచుకుంటాడు. అట్టి భర్తనిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు అమరావతిని కూడా దిగ్భంధన చేయబోతున్నాడని గ్రహించి, భర్త దేవేంద్రునకు శచీదేవి సమరోత్సాహము పురికొలిపినది.

సరిగా ఆరోజు శ్రావణ పూర్ణిమ కావటంచేత పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించినబడిన రాక్షా దేవేంద్రుని చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయయాత్రకు అండగా నిలిచి, తిరిగి త్రిలోకాధిపత్యాన్ని పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన ఆ 'రక్షాబంధనోత్సవం' నేడు 'రాఖీ' పండుగగా ఆచరించబడింది.

అలాగే విదేశీయులు మనదేశాన్ని పాలిస్తున్న రోజుల్లో మొగలాయీల దుర్నీతికి దురంతాలకు ఏ మాత్రం అడ్డూ ఆపూ లేకుండా పోయేది. హిందూ జాతి వారి కబంధహస్తాలలో నలిగిపోయేది. స్త్రీలు వారి మాన ప్రాణరక్షణకై వీరులైన యోధులను గుర్తించి వారికి 'రక్షాబంధనం' కట్టి వారు చూసే సోదర భావముతో రక్షణ పొందేవారు.

ఒక సారి 'రాణి కర్ణావతి' శత్రువులు తన దుర్గాన్ని ముట్టడించినప్పుడు 'ఢిల్లీ పాదుషా'కు రాఖీ పంపగా ఆమెను సోదరిగా భావించిన పాదుషా శత్రువులను తరిమికొట్టి ఆ సోదరి ఇంట భగినీ హస్తభోజనం చేసి, కానుకలు సమర్పించినట్లు గాథలు ఉన్నాయి. అట్టి రక్షాబంధన్ పండుగను అమితానందంతో జరుపుకుందాం. మరి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు..!!

వెబ్దునియా పై చదవండి