భీష్మ ఏకాదశి విశిష్టత- విష్ణు సహస్ర నామ స్తోత్రమును.. !

మంగళవారం, 27 జనవరి 2015 (16:45 IST)
భీష్ముడు భారతంలో మణిపూస వంటివాడు. ఈతడు సత్యవతీ, శంతనుల వివాహ సంధానకర్తగా, ధృతరాష్ట్ర, పాండురాజులు పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు చెప్పించిన పితృతుల్యునిగా, కౌరవుల సర్వసైన్యాధక్షునిగా, సర్వలోకావళికి పాపభంజనం, పుణ్యప్రదం, మోక్షప్రదమునగు ‘శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము’ను అందించిన ఆచార్యునిగా సుప్రసిద్ధుడు.
 
గంగా, శంతనుల కుమారుడైనందున ఇతనికి ‘గాంగేయుడు’, ‘దేవవ్రతుడ’నియు అంటారు. శంతన మహారాజుతో వివాహపూర్వము ఏర్పరచుకొనిన నియమమును రాజు గాంగేయుని జననమున ఉల్లంఘించినందున, ఆ పిల్లవానిని పెంచి పెద్దవానిని చేసి సకల విద్యాపారంగతుని చేసి అప్పగించగలనని పలికి, గంగాదేవి గాంగేయుని తీసికొని శంతనుని విడచి వెళ్ళింది. 
 
గంగాదేవి గాంగేయుని పరశురాముని వద్ద సకల విద్యలు, ధనుర్విద్యను నేర్పించి కొంత కాలమునకు శంతన మహారాజుకు అప్పగించింది. సత్యవతి తండ్రి దాశరాజుకు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞచేసినందున తాను యావజ్జీవము బ్రహ్మచర్య వ్రతము పాటించి గాంగేయుడు భీష్ముడుగా ప్రసిద్ధికెక్కాడు.
 
ఇలా ప్రతిజ్ఞ చేసిన కుమారుడు భీష్మునికి శంతనుడు స్వచ్ఛంద మరణ వరమును ప్రసాదించాడు. శంతన, సత్యవతులకు చిత్రాంగద, విచిత్రవీర్యులను ఇరువురు కుమారులు కలిగారు. చిత్రంగదుడు గర్వాతిశయమున గంధర్వరాజు చిత్రాంగదుని చేతిలో మరణించాడు. 
 
భీష్ముడు విచిత్ర వీర్యుని సింహాసనాధిష్ఠితుని గావించి, అంబిక, అంబాలికలతో వివాహం జరిపించాడు. కాని విచిత్రవీర్యుడు కారణాంతరాలచే శుష్కించినవాడై, కొద్దికాలానికే విగతజీవుడయ్యాడు. కురువంశాభివృద్ధికి సత్యవతి భీష్ముని వివాహం చేసికొనమని ప్రోత్సహించింది. 
 
కాని భీష్ముడు తన ప్రతిజ్ఞనుల్లంఘించలేదు. ఆమె వ్యాసభగవానుని స్మరించి, ఆయన అనుగ్రహమున కోడండ్రు ద్వారా ధృతరాష్ట్ర, పాండురాజులను అంబాలిక దాసి ద్వారా విదురుని పొందింది. ధృతరాష్ట్ర, పాండు రాజులను తదుపరి వారి సంతతి అగు కౌరవ పాండవులను భీష్ముడు పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించాడు.
 
కౌరవుల దుశ్చింతన వలన కౌరవ పాండవులకు యుద్ధమనివార్యమయంది. కౌరవ సర్వసైన్యాధ్యక్షునిగా భీష్ముడు పాండవులతో ధర్మయుద్ధంచేశాడు. భీష్ముని శస్తధ్రాటికి అర్జునుని రథసారథియైన శ్రీకృష్ణుడు కోపోద్రిక్తుడై ఆయుధమును ధరింపనని ప్రతినబూనినవాడు యుద్ధరంగమున చక్రహస్తుడై ‘‘నేను భీష్ముని చంపుదు, నిన్నుగాతు విడువుమర్జున’’ అని పలికి భీష్మునిపైకి పోబోయాడు. అట్టి తనను చంపబూనిన శ్రీకృష్ణుడే తనకు దిక్కు అని భీష్ముడు స్తవము చేసినట్లు భాగవతము ప్రథమాస్కందమునందలి పోతనమహాకవి అత్యద్భుత రచన భీష్మస్తవము’ విశదపరుస్తుంది.
 
ధర్మపక్షపాతియైన భీష్ముడు శిఖండిని యుద్ధరంగమున తాను చూచిన అస్త్ర సన్యాసము చేయుదునని ధర్మరాజునకుతెలుప, అవ్విధమున ఒనర్చి అర్జునుడు భీష్ముని శరతల్పగతుని చేసెను. స్వచ్ఛంద మరణము వరముగాగల భీష్ముడు శరతల్ప గతుడై ఉండియు ధర్మరాజుకు అనేక ధర్మములను బోధించి చివరగా మానవులు ముక్తినొందెడి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును జగదాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ సమక్షముననే ఆచార్యత్వము వహించి బోధించాడు. ఉత్తరాయణ పుణ్యకాలము సమీపించిన తరువాత మాఘ శుద్ధ ఏకాదశిన తండ్రిగారిచ్చిన స్వచ్ఛంద మరణ వరమువలన భీష్మాచార్యులు శరీరం త్యజించి శ్రీ విష్ణు సన్నిధి చేరారు.
 
ఇంకా శ్రీ మహావిష్ణువునకు ప్రీతిపాత్రమైన తిథులలో ‘ఏకాదశి’ ముఖ్యమైనది. దీనినే ‘హరివాసరము’ అని కూడా అంటారు. ఏకాదశి తిథిన భక్తజనులు ఉపవాసము చేస్తారు. భగవన్నామ స్మరణ, జప, పారాయణలతో భగవానుని సమీపమున (ఉప) మనస్సును ఉంచుటయే(వాసము) ఉపవాసం చేస్తారు. శనివారం (31వ తేదీ)న వచ్చే భీష్మ ఏకాదశి రోజున పితృదేవతలు అర్ఘ్యం సమర్పించడం ద్వారా పుణ్యఫలాలను పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి