ఐస్‌క్రీంను ఎవరు కనుగొన్నారు..?

మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (12:57 IST)
చిన్నా, పెద్దా.. తేడా అనేది లేకుండా అందర్నీ ఊరించే పదార్థం ఐస్‌క్రీం. మండువేసవిలో తియ్యగా, చల్లగా అలరించే ఐస్‌క్రీం రుచిని ఆస్వాదించని వారెవరూ ఉండరు. అయితే మొట్టమొదటిసారిగా ఈ ఐస్‌క్రీంను ఎవరు కనుగొన్నారు, దీన్ని ఎవరు తయారు చేశారు, అసలు ఇదెలా పుట్టింది..? అనే అంశాలను పరిశీలిద్ధాం. 
 
ఐస్‌క్రీం అనే పదార్థాన్ని మిగిలిన వంటల్లాగా ఎవరూ తయారు చేయలేదు. ఇది ఏ వంటగాడి చేతిలోనూ రూపుదిద్దుకోలేదు. పూర్వం రాజులు, జమీందార్లు, ధనవంతులు, సంపన్న వర్గాల ప్రజలు మత్తుపానీయాలను ఐస్‌తో చల్లబరిచి తీసుకునేవారు. ఆ తర్వాత ఈ విధానమే ఐస్‌క్రీం తయారీకి ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు.
 
ఇందులో భాగంగానే ఇంగ్లండ్ రాజ భవనంలో పనిచేసే వంటవాడు చల్లని ఓ పదార్థాన్ని తయారు చేసి రాజుకు వడ్డించాడట. అది భుజించిన రాజు దాని రుచికి ముగ్ధుడయ్యాడట. ఆ పదార్థమే ఐస్‌తో తయారైన ఐస్‌క్రీం. అయితే ఈ పదార్థం తయారీ రహస్యాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆ వంటవాడి వద్ద ఇంగ్లండ్ రాజు మాట తీసుకుని, ఆ వంటవాడికి సంవత్సరానికి కొంత మొత్తం డబ్బును ముట్టజెప్పేవాడట.
 
అలా కాలం గడుస్తుండగా డబ్బుకు ఆశపడిన ఆ వంటవాడు ఐస్‌క్రీం తయారీ రహస్యాన్ని యూరోపియన్లకు రహస్యంగా చేరవేశాడు. అలా వంటవాడి ద్వారా యూరోపియన్లకు, వారి ద్వారా అమెరికన్లకు ఐస్‌క్రీం తయారీ రహస్యం వెలుగులోకి వచ్చింది. తదనంతరం న్యూజెర్సీకి చెందిన నాన్సీ జాన్సన్ అనే మహిళ సులభ పద్ధతిలో ఐస్‌క్రీంను తయారు చేసే చేతి మిషన్‌ను కనుగొంది. ఆ తర్వాత ఐస్‌క్రీం తయారీ సులభంగా అందరికీ అందుబాటులో వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి