ప్రేమపూర్వక స్పర్శతో మానసిక స్వాంతన..!

FILE
ప్రేమపూర్వక స్పర్శ మానసికంగా ఎంతో స్వాంతననిస్తుంది. మనసుకు ఎంతో ఆత్మీయతను అందిస్తుంది. భర్త భుజంపై వాలి కష్టసుఖాలను పంచుకునేటప్పుడు మాటల్లో చెప్పలేని దగ్గరితనం స్పర్శతోనే సాధ్యం. తల్లి చేతి స్పర్శలోని వెచ్చదనం చిన్నారులకు ధైర్యాన్నిస్తే.. దుఃఖంలో ఉన్న స్నేహితులను దగ్గరికి తీసుకున్నప్పటి స్పర్శ వారికి కొండంత అండను, ఉపశమనాన్ని ఇస్తుంది.

తల్లి చేతి స్పర్శను తేలికగా గుర్తుపట్టే చిన్నపిల్లల్ని గమనిస్తే.. ఇతరులు ఎత్తుకుంటేనే వాళ్లు వెంటనే ఏడుపు లంకించుకోవటం తెలిసిందే. ఎందుకంటే పిల్లలు తల్లి స్పర్శలోని వెచ్చదనానికి అంతలా అలవాటుపడిపోయారన్నమాట. ఇక తండ్రి కౌగిలింతల్లోని మాధుర్యం తెలియని పిల్లలుండరంటే అతిశయోక్తి కాదు. అమ్మ కొట్టిందనో, అన్న కొట్టాడనో, స్కూల్లో టీచర్ కోపగించుకుందనో చెబుతూ తండ్రి వద్దకు వెళ్లే చిన్నారుల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని లాలించే తండ్రి స్పర్శలోని హాయి అందరికీ అనుభవమే.

నువ్వు బాగా చదువుకుంటే భవిష్యత్తులో చాలా గొప్పవాడివి అవుతావంటూ టీచర్ భుజం తట్టే ఆ ప్రోత్సాహపూరిత స్పర్శ కూడా మంచి ప్రేరణ కలిగిస్తుంది. స్నేహితులు, బంధువులు, తోటివారిపట్ల మనం చూపే అభిమానానికి కొలమానం కూడా స్పర్శే. అనుకోకుండా కలవటం, ఏవైనా విజయాలు సాధించినప్పుడు అభినందించటం, గొప్ప పనులు చేసేందుకు ప్రోత్సహించటం.. తదితర సందర్భాలలో అభినందనపూర్వకంగా చేతిని కలిపినప్పుటి స్పర్శే ఇందుకు నిదర్శనం.

ఈ స్పర్శ అనేది కేవలం మనుషులకే కాదు, జంతువులకు కూడా స్పర్శను పసిగట్టే గుణం ఉంటుంది. ముఖ్యంగా పెంపుడు జంతువుల విషయంలో చూస్తే.. అవి యజమానుల చేతి స్పర్శను ఇట్టే పసిగట్టేస్తాయి. వాటిని ప్రేమగా దగ్గరికి తీసుకుని నిమిరితే అమితమైన సంతోషాన్ని వివిధ చేష్టలతో వ్యక్తం చేస్తాయి. ఇదంతా ఆత్మీయమైన, ప్రేమభావంతో కూడుకున్న స్పర్శ ప్రభావమే. కాబట్టి.. స్వచ్ఛమైన మనసుతో, ప్రేమపూర్వక స్పర్శతో అనుబంధాలను మరింత బలపరచుకుంటారు కదూ..?

వెబ్దునియా పై చదవండి