మధ్యవయసు వారిలో కనిపించే మలబద్దకం

సాధారణంగా అనేక మంది మలబద్దకంతో బాధపడుతుంటారు. దీన్ని సులభంగా కనిపెట్టవచ్చు. మలవిసర్జన సమయంలో నొప్పి వస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు మలబద్దకం సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అయితే, ఈ సమస్య పట్ల నిర్లక్ష్యం చేయడం తగదు. తీవ్రమైన నొప్పితో బాధపడే వరకు డాక్టరు దగ్గరకు వెళ్లకుండా ఉండకూడదు. మలద్వారానికి పగుళ్ళు ఏర్పడాన్ని మలబద్దకం ఫిషర్‌గా కూడా పిలుస్తారు.

దీనికి వెంటనే చికిత్స చేయించుకోవడం మంచిది. లేదంటే దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. ఇది ఎక్కువగా మధ్యవయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మలద్వార ప్రాంతంలో రక్తప్రసరణ తక్కువగా ఉండటం వల్లే ఈ పగుళ్లు ఏర్పడతాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఫిషర్ లక్షణాలేంటి..?
మలద్వారం చాలా సున్నితమైంది. ఈ పగుళ్లు వచ్చిన వెంటనే నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. మల విసర్జన సమయంలో భరించలేనంత నొప్పి ఉంటుంది. ఈ నొప్పి కొందరిలో గంటల తరబడి ఉంటుంది. విసర్జించే మలంలో రక్తం కనిపిస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే వాపు, దురద కూడా వస్తాయి.

ఈ వ్యాధి కారకాలు...?
పైల్స్‌కు చేసిన ఆపరేషన్ సరిగా చేయక పోవడం వల్ల ఈ మలబద్దకం పిషర్ వచ్చే అవకాశం ఉంది. మల విసర్జన సమయంలో ఎక్కువగా కష్టపడటం వల్ల మలద్వారంపై ఎక్కువ ఒత్తిడి పెరిగి చర్మం చిట్లిపోతుంది.

మహిళల్లో అయితే ఎక్కువ సార్లు గర్భం దాల్చడం, దీర్ఘకాలంగా లాక్సాటివ్ మందులు వాడకం కూడా ఈ సమస్యకు దారి తీయొచ్చు. మరికొన్ని సమయాల్లో అంతర్గతంగా ఉండే అల్సరేటివ్ కొలైటిస్, సుఖ వ్యాధులు, క్యాన్సర్ కూడా దీనికి కారణమవుతాయి.

పాటించాల్సినవి... పాటించకూడనివి..!!
ఈ తరహా వ్యాధితో బాధపడే వారు ఎక్కువగా నీరు తాగాలి. జంక్ ఫుడ్, ఉప్పు, కారం అధికంగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలను తాగడం వల్ల మర్నాడు ఉదయం మలవిసర్జన సాఫీగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మలబద్దకం ఉన్న వారు వేడి పాలలో కొద్దిగా ఆముదం కలుపుకుని తాగితే మంచిది.

ఈ సమస్యతో ఎక్కువగా బాధపడేవారు రోజుకు మూడుసార్లు వేడినీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే మలబద్దక సమస్య తగ్గిపోవచ్చని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి