మన శరీరంలో క్యాల్షియం తక్కువైతే, ఈ లక్షణాలు కనిపిస్తాయట..!
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (14:07 IST)
మన శరీరానికి అత్యంత అవసరమైన మరియు ముఖ్యమైన పోషకాల్లో కాల్షియం కూడా ఒకటి. సాధారణంగా శరీరంలోని ఎముకలు దృఢంగా ఉండాలన్నా.. గుండె ఆరోగ్యంగా పని చేయాలన్నా, హార్మోన్ల సమతుల్యత, రక్తపోటు, అలాగే బరువు నియంత్రణలో ఉండాలంటే మనకు క్యాల్షియం అవసరమవుతుంది. అంతేకాకుండా ఇతర జీవక్రియలకు కూడా క్యాల్షియం కావాలి.
కానీ కొందరు క్యాల్షియం లోపంతో సతమతమవుతుంటారు. కాల్షియం లోపం ఉన్నట్లు వారికి కూడా తెలియదు. క్యాల్షియం లోపం వల్ల మన శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఓసారి చూడండి..
* కాలు కండరాలు పదే పదే పట్టేస్తుంటే, క్యాల్షియం లోపం ఉన్నట్లు తెలుసుకోవాలి. కొన్ని సార్లు పలు ఇతర కారణాల వల్ల కూడా అలా జరగవచ్చు. అయితే ఈ సమస్య ఎక్కువ కాలం పాటు ఉన్నట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. కాల్షియం లోపం ఉన్నట్లు తేలితే.. వైద్యుడి సూచన మేరకు మందులు వాడాలి.
* కాల్షియం లోపం ఉంటే చేతి వేళ్లలో గుండు పిన్ను గుచ్చినట్లు అనిపిస్తుంటుంది. అలాగే వేళ్లు మొద్దుబారిపోయి, స్పర్శ లేనట్లు అనిపిస్తాయి.
* తరచూ రక్తపోటు పెరుగుతుంటే క్యాల్షియం లోపం ఉన్నట్లు గుర్తించి చికిత్స తీసుకోవాలి.
* చిన్నపాటి దెబ్బ లేదా గాయం తగిలినా ఎముకలు విరిగితే కాల్షియం లోపం ఉన్నట్లు గుర్తించాలి.
* కాల్షియం లోపం ఉంటే అధిక బరువు త్వరగా తగ్గుతారని, సన్నగా మారిపోతారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
* కాల్షియం లోపం ఉంటే గుండె కొట్టుకునే వేగం అసాధారణ రీతిలో ఉంటుంది.
* చేతి, కాలి వేళ్ల గోర్లు చిట్లుతుంటే దాన్ని కూడా కాల్షియం లోపంగా భావించాలి.
* రాత్రి పూట నిద్రలో బెడ్‌పై అనేక సార్లు అటు ఇటు దొర్లుతూ ఉన్నా దాన్ని కాల్షియం లోపంగా అనుమానించాలి. డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.