పోషకాల గని దోసకాయ...

మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (10:56 IST)
వేసవికాలంలో దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. కానీ దోసకాయ వలన వేసవికాలంలో మాత్రమే కాకుండా అన్ని కాలాలలోనూ, అన్ని విధాలుగా చాలా ప్రయోజనాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అధికంగా పండించే పంటలలో దోసకాయ నాలుగో స్థానంలో ఉంది. ఆరోగ్యాన్ని పెంపొందించే విటమిన్‌లు, మినరల్స్‌ దోసకాయలో పుష్కలంగా లభిస్తాయి. అంతేకాకుండా దానిని చర్మానికి వాడే వివిధ రకాల ఉత్పత్తులలో కూడా వాడుతున్నారు. దోసకాయను తినటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇపుడు తెలుసుకుందాం. 
 
దోసకాయలో 90 శాతం వరకు నీరు ఉంటుంది. విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది కనుక, వేసవి కాలంలో వేడి చేస్తే శరీరాన్ని చల్లబరుచుటకు కార్బోనేటేడ్ ద్రావణాల కన్నా, దోసకాయను ఆరగించడం మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. దోసకాయలో యాంటీ-ఇంఫ్లమేటరీ గుణాలు ఉన్నందువలన, కంటికి కలిగే వ్యాధులను తగ్గించటమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కేవలం 15 నిమిషాల పాటూ కళ్ళపై, తాజా దోసకాయ ముక్కలను ఉంచటం వలన మంచి ఉపశమనాన్ని పొందవచ్చు. 
 
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో ఉంచే హార్మోన్ దోసకాయలో ఉందని పరిశోధనల్లో తేలింది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, దోసకాయ రసాన్ని తాగటం వలన మంచి ఫలితాలను పొందుతారు. శరీరంలో కొవ్వు పదార్థాలను తగ్గించే స్టేరాల్ అనే మూలకం దోసకాయలో ఉంటుంది. దీనిని బరువు తగ్గించే ఆహార ప్రణాళికలో చేర్చుకోండి. ఎందుకంటే, ఇది అధిక మొత్తంలో పోషకాలను కలిగి ఉండి, తక్కువ క్యాలరీలను అందిస్తుంది. 
 
అధిక మొత్తంలో ఫైబర్‌ను కలిగి ఉండి, జీర్ణక్రియను మెరుగుపరచటమేకాకుండా, కడుపు నిండేలా చేస్తుంది. దోసకాయలో ఉండే నీటి శాతం, శరీర వ్యవస్థలలో ఉండే విష, హానికర పదార్థాలను బయటకు పంపివేస్తాయి. శరీరాన్ని చల్లబరచి మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. జుట్టు, గోళ్ళ పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషించే సిలికాను పుష్కలంగా కలిగి ఉంటుంది. దోసకాయ వలన చర్మ సమస్యలను, ర్యాషస్‌ను కూడా దూరం చేసుకోవచ్చు. ఇందులో చర్మ ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు