అల్పాహారంగా గుడ్డును తీసుకుంటే..

బుధవారం, 27 జనవరి 2016 (10:06 IST)
పిల్లల నుంచి పెద్దల దాకా గుడ్డును ఇష్టపడిని వారుండరు. ఎదిగే పిల్లలకు అవసరమైన ప్రోటీన్లను గుడ్లు అందజేస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారిని రోజుకో గుడ్డు తినాల్సిందిగా నిపుణులు సలహాలిస్తుంటారు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండపుష్టికి ఎంతో సహాయపడుతుంది. గుడ్డు తేలికగా జీర్ణం కాదు కాబట్టి తొందరగా ఆకలివేయదు. గుడ్లు మనకు ఎల్లప్పుడు దొరికే చౌకైన ఆహారము. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటుందని కొందరు గుడ్లను పూర్తిగా మానేస్తుంటారు. కానీ వీటిని మితంగా తింటే ఎలాంటి నష్టమూ ఉండదు. గుడ్లలో పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు చాలా ఉన్నాయి. అందువల్ల వీటిని ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
 
ఉదయంపూట అల్పాహారంగా గుడ్లను తీసుకుంటే చాలాసేపు కడుపు నిండిన భావన కలిగిస్తుంది. ఆకలి వేయకుండా చూస్తూ.. ఎక్కువ ఆహారం తినకుండా చేస్తుంది. ఇలా బరువు తగ్గటానికి గుడ్లు దోహదపడుతుంది.
 
ప్రోటీన్లతో నిండిన గుడ్లలో మనకు అవసరమైన అన్నిరకాల అమినో ఆమ్లాలు లభిస్తాయి. శారీరక శ్రమ అధికంగా చేసినప్పుడు తిరిగి శక్తిని పుంజుకోవటానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.
 
గుడ్లలో విటమిన్‌ డి చాలా ఉంటుంది. శరీరానికి ఎండ తగలకపోవటం, సరైన పోషకాహారం తీసుకోకపోవటం వల్ల ప్రస్తుతం చాలామంది విటమిన్‌ డి లోపంతో బాధపడుతున్నారు. అందువల్ల గుడ్లను ఆహారంలో చేర్చుకోవటం వల్ల ఈ సమస్యలను నివారించవచ్చును.
 
మన శరీరం అవసరమైనంత మేరకు కోలిన్‌ను తయారుచేసుకోలేదు. ఇది లోపిస్తే కాలేయజబ్బు, సిరలు, దమనులు గట్టిపడటం, నాడీ సమస్యల వంటి వాటికి దారితీస్తుంది. కాబట్టి కోలీన్‌ అధికంగా ఉండే గుడ్లను తీసుకోవటం మేలు. ముఖ్యంగా గర్భిణులకు ఇదెంతో అవసరం. 

వెబ్దునియా పై చదవండి