సరియైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం, తగిన వ్యాయామం లేకపోవడం వలన అధికబరువు సమస్య మొదలవుతుంది. అంతేకాదు ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకోలేక, ఆ తర్వాత ఆదరాబాదరాగా అమితమైన ఆహారాన్ని తీసుకోవడం వలన పొట్ట పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. మొత్తంమ్మీద బానపొట్టతో బండబరువుతో సతమతమైపోతారు. ఈ బానపొట్టను, అధిక బరువుకు కారణాలేమిటో చూద్దాం.
శారీరక శ్రమ, వ్యాయామం లేకపోవడం. రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రలోకి జారుకోవడం. భోజనానికి మధ్య విరామం లేకుండా ఏదో ఒకటి తినడం. మానసికంగా ఒత్తిడికి గురి అయినప్పుడు తీసుకునే ఆహారం మోతాదు ఎక్కువ అవుతుంది. ఫలితంగా లావు పెరగడం ప్రారంభమవుతుంది.
ప్రతిరోజూ కనీసం 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
పండ్లు, పచ్చి కూరగాయలు, ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటుండాలి. మాంసాహారం, వేపుళ్లు, బేకరి ఫుడ్స్, ఐస్‌క్రీమ్స్, కేక్స్, బిర్యానీ వంటి వాటిని మానివేయాలి. భోజనానికి మధ్య చిరుతిండ్లను మానివేయాలి. అధికంగా ఉప్పు, స్వీట్లను తీసుకోకూడదు.