బ్లాక్ టీ తాగితే ఆరోగ్యానికి మంచిదేనా?

బుధవారం, 24 అక్టోబరు 2018 (15:46 IST)
బ్లాక్ టీ సర్వరోగ నివారిణి కాకపోయినా ఫ్లూ, ఆహార నాళం, పొట్ట కేన్సర్లను అడ్డుకునే గుణాలు ఈ టీలో ఉన్నాయి. ఎందుకంటే బ్లాక్ టీలో ఉండే పాలీ ఫినాల్స్ అనే పదార్థాలు యాంటీ ఆక్సిడెంట్లకంటే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయట. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయని కూడా చెబుతున్నారు. అంతేకాకుండా.. ఈ పాలీ ఫినాల్స్ దంతాలకు కూడా మేలు చేస్తాయట. పాచి పట్టకుండా ఆపడమే కాక, పళ్ల మీది ఎనామిల్‌ను గట్టిపరుస్తాయి. బ్లాక్ టీలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 
 
1. బ్లాక్ టీ తాగితే మన మెదడులో చురుకుదనం కూడా పెరుగుతుందట. అలసటను కూడా తగ్గిస్తుంది. మొత్తానికి బ్లాక్ టీ తాగితే ఆలోచనా సామర్థ్యం పెరుగుతుందని, గ్రీన్ టీ తాగితే మెదడు చురుగ్గా పని చేస్తుందని, మొత్తానికి క్రమం తప్పకుండా టీ తాగేవారిలో శారీరక ఆరోగ్యం బాగుంటుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. 
 
2. రోజూ బ్లాక్ టీ లేక గ్రీన్ టీని మూడు కప్పులు తీసుకోవడం వల్ల గుండె సమస్యలు పదకొండు శాతం మేరకు తగ్గుతాయంటున్నారు నిపుణులు. ఫ్యాట్, కొలెస్టరాల్ కలయిక మూలంగా ఏర్పడే క్లాట్స్‌ని, రక్తనాళాలో డెవలప్ అయ్యే అవకాశాలను టీ తగ్గిస్తుంది.
 
3. ‘టీ'లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. రెండు యాపిల్స్‌లో, ఐదు రకాల కూరగాయల్లో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రెండు కప్పుల టీలో లభిస్తాయి. ఈ తాజా పరిశోధనాంశాలను యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు వెల్లడించారు.
 
4. టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు కార్డియో వాస్క్యులర్ సమస్యలు రాకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. 
 
5. బ్లాక్ టీలో ఉండే ప్లేవనాయిడ్ ఎంత ఉంటుందో అంతే మోతాదులో గ్రీన్ టీలో లభిస్తుందని తాజా పరిశోధనలో తేలింది. టీలో ఉండే ప్లేవనాయిడ్స్ నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిని, ఎండోథీలియల్ ఫంక్షన్‌ను మెరుగుపరుస్తాయి. గుండె ఆరోగ్యంగా ఉండేలా చూసే వాటిలో ఇవి కూడా కీలకపాత్ర పోషిస్తాయి. తేనీరులోని ఫ్లేవనాయిడ్స్‌ గుండెను ఆరోగ్యవంతంగా పనిచేయిస్తాయి.
 
6. రోజూ టీ తాగేవాళ్లలో ఎముకలు బలంగా ఉంటాయి. అంతేకాకుండా బ్లాక్‌ టీ తాగేవారిని ఫ్లూ జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు. టీలో ఉండే ఫ్లోరైడ్‌ దంతాలు దృఢపడేందుకు సాయపడుతుంది.
 
7. గ్రీన్‌, బ్లాక్‌ టీలలో ఉండే ఎల్‌-థయానైన్‌ ఒత్తిడిని తగ్గించి మెదడును ప్రశాంతంగా ఉంచుతుంది. టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ రాకుండా కాపాడతాయి. అనేక రకాల అలెర్జీలకు టీ విరుగుడు కూడా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు