ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటే శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా ఎండాకాలంలో విరివిగా లభించే మామిడిపండ్లు తింటే చాలా మంచిది. ఒక్కో మామిడి పండు ఒక్కోరకమైన రుచిని కలిగిఉంటాయి. అందుకే దేశ విదేశాల్లోను మామిడిని ఎంత డబ్బయినా ఖర్చు పెట్టి తింటుంటారు. మన దేశంలో కూడా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటుంటారు. అయితే మామిడి పండ్లు ఎక్కువగా తింటే ఇబ్బందులు తప్పవంటున్నారు వైద్యులు.
వీటిని ఎక్కువగా తింటే కాళ్ళు, చేతులు తిమ్మిర్లు రావడం, లాగడం వంటి సమస్యలు వస్తాయి. సరిగ్గా మాగని పండ్లు తినడం వల్ల అజీర్తి సమస్య వస్తుందట. పొట్టలో మంట, సరిగ్గా జీర్ణం కాని సమస్యలతో బాధపడక తప్పదట. పచ్చిమామిడిని ఎంత తక్కువగా తింటే అంత మంచిదట. విపరీతంగా మామిడి పండ్లను తింటే చర్మ ఎలర్జీ, దురద, సెగ గెడ్డలు వంటి సమస్యలు ఏర్పడతాయట. కాబట్టి మామిడిపళ్లు తీయగా వున్నాయి కదా అని అదేపనిగా తినకూడదని తెలుసుకోమంటున్నారు.