ఇపుడంతా బ్యాడ్ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతున్నాయనీ, అందువల్ల గుండె జబ్బులు, మధుమేహం సమస్యలు వస్తున్నాయని చాలామంది చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకుంటున్నారు. వాటిలో కొర్రబియ్యం ఇపుడు చేరిపోయింది. అంతా వాటి పట్ల ఇష్టతను ప్రదర్శిస్తున్నారు. ఈ కొర్రలు ఆరోగ్యానికి మంచిదా కాదా చూద్దాం.
దీనిలో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, ధైమిన్, రైబోఫ్లేవిన్ అధికపాళ్లలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు కొర్రబియ్యం దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర శాతాన్ని పూర్తిగా అదుపులో ఉంచుతుంది.
ఉదర సంబంధ సమస్యలకు కొర్రబియ్యం చక్కటి ఉపశమనం కలిగిస్తుంది. కడుపులో నొప్పి, ఆకలి లేకపోవడం, అజీర్తి సమస్యలకు ఇది చక్కగా పని చేస్తుంది. జీర్ణ నాళాన్ని శుభ్రం చేయడంలో ఇది ప్రముఖపాత్ర వహిస్తుంది. ఇది మూత్రం పోసేటప్పుడు మంటను తగ్గిస్తుంది.
కొర్రబియ్యం వండుకునే విధానం.....
ఒక గ్లాసు కొర్రలను శుభ్రంగా కడిగి రెండు గ్లాసులు నీరు పోసి ఒక గంట నానబెట్టాలి. నానబెట్టిన కొర్రబియ్యాన్ని కుక్కర్లో పెట్టి ఉడికించాలి. ఒకవేళ ఇలా తినలేకపోతే సగం బియ్యం, సగం కొర్రలు కలిపి వండుకోవచ్చు. ఈ అన్నంలో వేపుడు కూరలకన్నా పులుసు కూరలు ఎక్కువ రుచిని ఇస్తాయి.