గంటలు గంటలు కూర్చీలకే అతుక్కుపోతున్నారా.. అయితే పైల్స్ ముప్పు తప్పదని అంటూ హెచ్చరిస్తున్నారు.. వైద్యులు. అలా గంటల పాటు కూర్చుని పనిచేసే వారు ఆహారంలో పీచు అధికంగా వుండేలా చూసుకోవాలని.. వారు సూచిస్తున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలను రోజూ డైట్‌లో చేర్చుకోవాలి.
కదలకుండా ఒకే ప్రదేశంలో కూర్చుని చేసే ఉద్యోగాల్లో ఉన్నవారు ఎక్కువగా పైల్స్ సమస్య బారిన పడుతుంటారు. అలాగే ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు వంటి వాటితో మొలలు వస్తుంటాయి. నీరు తక్కువగా తాగడం, ఫాస్ట్ ఫుడ్స్, వేపుళ్లు అతిగా తినడం వంటివి కూడా ఇందుకు కారణం అవుతాయి.
పైల్స్ నివారణకు పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంతేగాకుండా సోయా బీన్స్, బ్లాక్ బీన్స్, పీచు అధికంగా ఉండే కూరగాయలు, ధాన్యాలు వంటివి పైల్స్ రోగాన్ని నిరోధిస్తాయి. వీటితో పాటు మామిడి, నిమ్మ, బొప్పాయి మొదలైన పండ్ల రసాలు రోజూ తాగాలి.
నిమ్మ, బెర్రీలు, ఆపిల్స్, టమోటాలు మొదలైనవి పైల్స్ నివారణకు ఉపయోగపడతాయి. అంజీర పండును రాత్రంతా నీటిలో నానపెట్టి ఉదయం పరగడుపును తింటే పైల్స్ వ్యాధి నయమైపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.