హోటల్ భోజనం వద్దే వద్దు.. కర్రీ పాయింట్‌కు వెళ్ళనేవద్దు.. ఇంటి భోజనమే ముద్దు..

మంగళవారం, 10 జనవరి 2017 (12:56 IST)
ఉదయం, రాత్రి వరకు ఒకటే ఉరుకులు పరుగులు. ఇక ఏం వండుకుంటాంలే. హోటల్లో తెచ్చుకుని తిని నిద్రపోతే పోలా..? అనుకునేవారు మీరైతే.. ఇక మీ పద్ధతిని మార్చుకోండి. ఇంట్లో దంపతులు ఇద్దరు ఉద్యోగులయితే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అందులో ప్రధానంగా భోజన సమస్య. వంట వండుకోవడమే కొందరు మానేస్తుంటారు. వీలు చిక్కినప్పుడల్లా మాత్రమే వండుతుంటారు. బయట దొరికే ఆహారాన్ని తీసుకొంటుంటారు. 
 
టైమ్ లేదని హోటల్ ఫుడ్స్‌కే ప్రాధాన్యత ఇస్తారు. హోటల్స్‌లో భోజనం, కర్రీ పాయింట్ నుండి కర్రీలు తెచ్చుకోవడం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ఇంట్లో వండుకుని తినే ఆహారం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని వారు సలహా ఇస్తున్నారు. ఇంటి ఆహారాన్ని తీసుకునేవారిలో మధుమేహం బారిన పడే ముప్పు 15శాతం వరకు తగ్గుతుందని తేలింది. పెరుగుతున్న పని ఒత్తిడి, నిస్సహాయత ఇవన్నీ బయట ఆహారపు అలవాట్లను మరింత పెరగడానికి కారణమవుతున్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. ఇవన్నీ అనారోగ్యానికి కారణమవుతాయి. 
 
శుచి..శుభ్రత లేని హోటల్ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని, జంక్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఊబకాయం, గుండెపోటు వంటి  సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సో.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ఇంటి భోజనాన్ని తీసుకోవాలని.. సమయపాలనతో ఇంట్లో వండుకుని తీసుకోవడం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి