ప్రపంచంలోనే తొలిసారి: మియాట్ ఆస్పత్రిలో క్లిష్టమైన ఆపరేషన్!

WD
WD
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్ శివారు ప్రాంతంలో ఉన్న మియాట్ ఆస్పత్రిలో అత్యంత క్లిష్టమైన.. అరుదైన ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ తరహా ఆపరేషన్‌ను పూర్తి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఆపరేషన్‌ను బంగ్లాదేశ్‌కు చెందిన ఐదేళ్ళ చిన్నారికి ఇటీవల విజయవంతంగా నిర్వహించినట్టు ఆస్పత్రి ఛైర్‌పర్సన్ మల్లికా మోహన్‌దాస్, డాక్టర్ వివి.బాషీలు శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ ఆపరేషన్ గురించి డాక్టర్ బాషీ వివరిస్తూ.. దగ్గు వచ్చినపుడు నోటి వెంట రక్తం రావడాన్ని గమనించిన వైద్యులు అత్యసరంగా ఆపరేషన్ చేయాలని సూచించారన్నారు. ఆసమయంలో పాపకు మూడేళ్లని చెప్పారు. ఈ వయస్సులోనే బాలికకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి అరోటిక్ అనెరిజంను సరిచేశారన్నారు. ఇది పుట్టుకలోనే వచ్చిందన్నారు.

పుట్టుకతోనే ఈ పరిస్థితి ఉండటం వల్ల రక్తం నేరుగా ఊపిరితిత్తులకు చేరుతుందన్నారు. ఈ ఆపరేషన్ తర్వాత ఏడాదిన్నర పాటు ఆ చిన్నారి బాగానే ఉందన్నారు. ఆ తర్వాత ఊపిరితిత్తుల నుంచి రక్తం కారడం ఆరంభమైందన్నారు. దీంతో స్థానిక వైద్యులను సంప్రదించగా, అయోటా నుంచి రక్తం లీక్ అవుతున్నట్టు చెప్పారని, దీనికి అత్యంత క్లిష్టతరంతో కూడిన సర్జరీ చేయాలని చెప్పడంతో భారత్‌కు తీసుకొచ్చారని చెప్పారు.

తొలుత ఒక ఆస్పత్రిలో చేరగా అక్కడ అయోటా అనెరిజం ఆపరేషన్ చేసి మూడు స్టెంట్‌లను అమర్చినట్టు చెప్పారు. ఆ తర్వాత కూడా రక్తం లీక్ కావడం ఆగిపోలేదన్నారు. తర్వాత తమ వద్దకు రాగా ఎమర్జెన్సీ కేసు కింద ఆపరేషన్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అయితే, ఆస్పత్రిలో చేరిన తర్వాత బాలిక బ్లడ్ గ్రూప్ ఏబీ నెగెటివ్ అని నిర్ధారణ అయిందన్నారు. ఈ తరహా రక్తం గ్రూపును పొందడం చాలా కష్టమన్నారు.

అదీ కూడా నాలుగైదు యూనిట్ల రక్తం కావాల్సి వచ్చిందన్నారు. ఎంతో శ్రమకోర్చి ఐదారు యూనిట్ల రక్తాన్ని సేకరించామన్నారు. ఆ తర్వాత ఈ చిన్నారికి ఆర్థిక సాయం చేసేందుకు చిల్డ్రన్స్ హార్ట్ ఇంటర్నేషనల్ మియాట్ ముందుకు వచ్చిందన్నారు. ఈ సంస్థను అత్యంత క్లిష్టమైన హృద్రోగ సమస్యలతో బాధపడే పేద చిన్నారుల ఆపరేషన్లకు అవసరమైన ఆర్థిక సాయం చేసేందుకు మియాట్ ఏర్పాటు చేసిందని డాక్టర్ బాషీ వెల్లడించారు.

ఈ ఆపరేషన్ ప్రక్రియలో భాగంగా.. హార్ట్‌ను ఓపెన్ చేసి హార్ట్‌లంగ్ మిషన్‌తో అనుసంధానం చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత రక్తాన్ని 18 డిగ్రీలకు చల్లబరిచినట్టు, ఎడమవైపు ఊపిరితిత్తిలో అనెరిజాన్ని వెడల్పు చేసి ఆపరేషన్ ప్రారంభించినట్టు చెప్పారు. రక్తాన్ని 18 డిగ్రీలకు చల్లబరిచినప్పటికీ.. శరీరంలోని ఇతర భాగాలకు రక్త ప్రసరణ యధావిధిగా కొనసాగించినట్టు తెలిపారు. దీని తర్వాత అనెరిజంను ఓపెన్ చేసినట్టు చెప్పారు.

అప్పటికే లోపల మెటల్ స్టెంట్స్ ఉన్నట్టు గుర్తు చేశారు. వీటికి మరమ్మతులు చేస్తూనే దెబ్బతిన్న ఊపిరితిత్తులకు సరిచేసినట్టు చెప్పారు. దీని తర్వాత శరీరాన్ని యధాస్థితికి తీసుకొచ్చి, హార్ట్ లంగ్ మిషన్‌ను తొలగించినట్టు చెప్పారు. తమకు తెలిసినంత వరకు ఈ తరహా ఆపరేషన్ చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారని ఆయన తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో తనతో పాటు.. డాక్టర్ హరీలాల్, డాక్టర్ కన్నన్, డాక్టర్ దిలీప్ కుమార్, అనస్థీషియా టీమ్ డాక్టర్ అజు జాకబ్, డాక్టర్ జ్యోత్స్నా, డాక్టర్ శంకర్‌‍లతో పాటు.. పలువురు నిపుణులు, ఇతర వైద్యసిబ్బంది పాల్గొన్నట్టు చెప్పారు. ఈ తరహా ఆపరేషన్ 4.5 లక్షల రూపాయలు అవుతుందని, కానీ, ఈ చిన్నారికి ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పూర్తిగా ఉచితంగా చేసినట్టు డాక్టర్ బాషీ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి