వికటించిన 'స్లిమ్' థెరపీ: మహిళ ప్రాణాలు హరి!

సోమవారం, 8 ఆగస్టు 2011 (16:59 IST)
హైదరాబాద్‌లో స్లిమ్ థెరపీ వికటించింది. ఫలితంగా ఒక మహిళ ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి. హైదరాబాద్‌, కూకట్‌పల్లిలోని ఆస్పత్రిలో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. సోమవారం వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు పరిశీలిస్తే... కరీంనగర్ జిల్లా రామగుండుకు చెందిన రమలతా అనే 35 సంపత్సరాల మహిళ... గత కొంతకాలంగా ఊబకాయంతో బాధపడుతూ వచ్చింది. ఆమె కూకట్‌పల్లిలోని ప్రసాద్ ఆస్పత్రిలో స్లిమ్ థెరపీ చేయించుకునేందుకు గత మే నెలలో ఆస్పత్రిలో చేరింది. ఆమెను పరిశీలించిన వైద్యులు గత 15 రోజుల క్రితం లైపోసెక్షన్ ఆపరేషన్ చేశారు.

ఈ చికిత్స తర్వాత రమలత ఆరోగ్యం కుదుట పడటంతో ఇంటికి చేరుకుంది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆమె ఆరోగ్యం మళ్లీ మొదటికి రావడంతో మళ్లీ ఆస్పత్రిలో చేరారు. ఆమెను పరిశీలించిన వైద్యులు.. ప్రేవులకు రంధ్రం ఏర్పడిందని, పైపెచ్చు.. ఒబేసిటీ పట్ల నిర్లక్ష్యంగా ఉండటం, అనీమియాతో బాధపడుతుంటడం వల్ల ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. దీనికి తగినట్టుగా వారు వైద్యం చేస్తూ వచ్చారు.

ఈ నేపథ్యంలో సోమవారం రమలతా కన్నుమూసింది. దీనికి మృతురాలి బంధువులు మాత్రం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆరోపిస్తున్నారు. మొత్తం మీద స్లిమ్ థెరపీ రమలత ప్రాణాలు తీసింది.

వెబ్దునియా పై చదవండి