టైప్ 2 మధుమేహానికి విరుగుడుగా టాయ్ చి

మంగళవారం, 1 ఏప్రియల్ 2008 (19:38 IST)
సాంప్రదాయిక చైనా మార్షల్ ఆర్ట్స్ వ్యాయామం టాయ్ చి, టైప్ 2 లక్షణాలు కలిగిన మధుమేహాన్ని నివారించడంలో సాయపడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. టాయ్ చి వ్యాయామం రక్తంలో గ్లూకోస్ స్థాయిలు తగ్గించడానికి మరియు బ్లడ్ గ్లూకోస్ మెటబాలిజం‌ను మెరుగుపర్చడానికి దోహదపడుతోందని ఈ అధ్యయనం సూచించింది.

బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన ఈ అధ్యయన నివేదిక ప్రకారం, టాయ్ చి చువాన్ వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తే టైప్ 2 మధుమేహ రోగుల టి సెల్ సహాయక చర్యలు మెరుగుపడుతాయి. శరీర రోగనిరోధక వ్యవస్థలో టి సెల్స్ అనేవి అత్యంత కీలకమైన బాగం. రోగ నిరోధక స్పందనను మార్చే ఇంటర్‌ల్యుకిన్స్‌తో సహా పలు శక్తివంతమైన రసాయనాలను ఇవి ఉత్పత్తి చేస్తాయి.

ఈ అధ్యయనం కోసం, టైప్ 2 మధుమేహ వ్యాధి ఉన్న 30 మంది రోగులలో టి సహాయక కణాలపై 12 వారాల కార్యక్రమంతో కూడిన టాయ్ చి వ్యాయామాల ప్రభావాన్ని శాస్త్రజ్ఞులు పరిశీలించారు. 12 వారాల కార్యక్రమం తర్వాత మధుమేహ రోగులలో గ్లూకోజ్ హెమోగ్లోబిన్ స్థాయిలు 7.59 నుంచి 7.16కి పడిపోయినట్లు గుర్తించారు. అదే సమయంలో రోగనిరోధక ప్రతిస్పందనను పెంచే ఇంటర్‌ల్యుకిన్-12 స్థాయిలు దాదాపుగా రెట్టింపు స్థాయిలో పెరిగాయి. రోగనిరోధక ప్రతిస్పందనను తగ్గించే ఇంటర్‌ల్యుకిన్-4 స్థాయిలు పడిపోయాయని ఈ అధ్యయనం తెలిపింది.

కఠినతరంగా ఉండే వ్యాయామ కార్యక్రమాలు రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను క్షీణింపజేస్తాయి. అయితే తేలికపాటి వ్యాయామ కార్యక్రమాలు అందుకు విరుద్ధంగా రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను పెంచుతాయి. చైనా సాంప్రదాయిక వ్యాయామ విధానం అయిన టాయ్ చి తేలికపాటి వ్యాయామ రీతిగా గుర్తింపు పొందింది.

కాబట్టి మధుమేహ రోగులు తేలిక పాటి వ్యాయామ విధానమైన టాయ్ చి ని పాటిస్తే సత్ఫలితాలు ఉంటాయని ఈ అధ్యయనం తెలిపింది.

వెబ్దునియా పై చదవండి