ఆబాలగోపాలానందకరం 'శ్రీకృష్ణాష్టమి'

సోమవారం, 3 సెప్టెంబరు 2007 (21:24 IST)
WD PhotoWD
శ్రావణ మాసపు అష్టమినాడు జన్మించిన శ్రీకృష్ణుడు ఆబాలగోపాలానికి అత్యంత ఆరాధనీయుడు. భగవద్గీతతో మానవాళికి ధర్మాన్ని బోధించిన గీతాకారుడు హిందువులకు పరమపూజ్యనీయుడు. జగద్గురువు జన్మించిన కృష్ణాష్టమి దినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటారు. శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని జన్మదినాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రీతిగా అవలంభిస్తారు.

కృష్ణాష్టమి సందర్భంగా దక్షిణ భారతదేశంలోని మహిళలు తమ గృహాలను అందంగా అలంకరిస్తారు. రకరకాల తీపి పదార్ధాలు నల్లనయ్యకు నైవేద్యంగా అందించేందుకు సిద్దమవుతాయి. బాలకృష్ణునికి అత్యంతప్రీతిపాత్రమైన వెన్నను ఆ గోపకిషోరునికి ఆరగింపచేసి, ఆ దేవదేవుని కరుణాకటాక్షవీక్షణాలు పొందేందుకు ప్రతి గృహం ఎదురుచూస్తుంటుంది.

ఇంటి వాకిలి నుంచి పూజామందిరం వరకు ముద్రితమై చిన్నారి పాదముద్రలు ఆ బాలగోపాలుని రారమ్మని ఆహ్వానం పలుకుతుంటాయి. పాదముద్రల కోసం నీరు, ధాన్యపు పిండి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. పసిపాపడి పాదాలకు అద్దిన పిండితో వేసిన పాదముద్రలను చూచిన కృష్ణభగవానుడు ఇంటిల్లిపాదిని చల్లగా కాపాడుతాడన్న భావన అందరికి ఆనందాన్ని చేకూరుస్తుంది. ముకుందుని భక్తులు పరమపవిత్రమైన భాగవతాన్ని పారాయణం చేయడంతోపాటుగా, సంగీత,నృత్య,గాన మరియు భజనలతో దేవకీనందుని రోజంతా స్మరించుకుంటారు.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

PTI PhotoPTI
ఇక ఉత్తర భారతంలో శ్రీకృష్ణజన్మాష్టమి కోలాహలం మాటలకు అందనిది. బాలకృష్ణుని విగ్రహానికి అర్ధరాత్రి వేళ అభ్యంగస్నానం చేయించి ఊయలలో ఉంచుతారు. తమ పిల్లలకు పాలు, వెన్న పట్ల ఆసక్తిని పెంపొందించేందుకుగాను నవనీతచోరుని లీలలలో ఒకటైన వెన్నను దొంగలించే ఇతివృత్తాన్ని ఉట్టిని కొట్టే వేడుక రూపంలో వీధుల్లో ఆచరిస్తారు. పెరుగు, వెన్నలతో నిండిన మట్టికుండను ఆకాశంలో వేలాడదీసారా అన్న రీతిలో అత్యంత ఎత్తులో వేలాడదీస్తారు.

మానవ పిరమిడ్ రూపంలో ఒకరిపైఒకరుగా ఎక్కిన పిల్లలు, యువకులు, పిరమిడ్ శిఖరానికి చేరుకుని కుండను పగలగొడతారు. ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించే ఈ ఘట్టం శ్రీకృష్ణజన్మాష్టమి వేడుకలలో అత్యంత కీలకమైనదిగా నిలిచి నయనానందకరాన్ని చేకూరుస్తుంది. ఇక భక్తులతో క్రిక్కిరిసిపోయిన అచ్యుతుని దేవాలయాలు సంకీర్తనలతో, వనమాలి అష్టోత్తర శతనామావళితో ఆధ్యాత్మిక భావ చైతన్యాన్ని నలుచెరుగులా వ్యాపింపచేస్తాయి.

ఫోటో గ్యాలెరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.