దానము-తపస్సు ఆచరించదగినవే గాని విడువదగినవి కావు: శ్రీకృష్ణుడు

శనివారం, 16 మార్చి 2013 (18:03 IST)
FILE
"దానం" ఓ పవిత్ర కార్యం.. దానం ఇచ్చేవారి ఆయుష్షు పెరిగినా.. పుచ్చుకునే వారి ఆయుష్షు మాత్రం క్షీణించిదని అగ్నిపురాణంలో అగ్నిదేవుడు వశిష్టుడికి వివరించియున్నాడు. పుణ్యంకోసమని దానంచేస్తే అది ప్రత్యుపకారమవుతుంది కనుక దేనినీ ఆశించకుండా దానం చేయడం ఉత్తమం.

దానం చేయటం వ్యక్తిగా నీ ధర్మమని దానం చేయాలి. ప్రత్యుపకారము, ఫలము ఆపేక్షించి దానము చేస్తే ఆ విధమైన దానం దానమే కాదని శాస్త్రవచనం. ప్రదేశము కాలముతో పని లేకుండా అపాత్రులకు అమర్యాద పూర్వకంగా ఇచ్చుదానము తామసం అన్నారు. రాజస, తామస, సాత్త్విక దానములలో సాత్త్విక దానము ఉత్తమమైనదిగా గీతలో శ్రీకృష్ణుని సందేశము.

దానము చేసేటప్పుడు సత్కారభావముతో మర్యాద పూర్వకముగా ఇవ్వాలి పాప ఫలితంగా దరిద్రుడైనవాడు, దీనుడు, మూఢుడు, అపాత్రులైన వారికి దాన ధర్మాలు చేయడం దాతకు అన్నివిధాల శ్రేయస్కరం.

దానం చేయటానికి కొన్ని నియమాలు, నిబంధనలు ఉన్న దానికి సవరణలు కూడా ఉన్నాయి. ‘‘సుపాత్ర దానాచ్చ భవేద్దనాఢ్యో, ధన ప్రభావేణ కరోతి పుణ్యమ్’’ అన్నారు అంటే యోగ్యునికి దానం చేయడంవలన దాత యొక్క సంపదలు అభివృద్ధి చెందుతాయి. దానివలన దాత అనేక పుణ్యకార్యాలు చేయవచ్చును.

‘పుణ్య ప్రభావాత్సురలో వాసి, పునర్ధనాఢ్యం పునరేవ భోగీ’’అంటే దానము చేయుటచే పుణ్యం లభిస్తుంది. పుణ్యకార్యాలు చేయటంవలన స్వర్గప్రాప్తి కలుగుతుంది. దానివలన తిరిగి ఉత్తమమైన జన్మ లభించి సర్వసౌభాగ్యాలు అనుభవించవచ్చును. కృతయుగమునందు తపస్సు, త్రేతాయుగమునందు బ్రహ్మజ్ఞానము, ద్వాపర యుగమందు యజ్ఞయాగాదులు, ఈ కలియుగంలో దానం ఉత్కలష్ట ధర్మములని నాలుగు యుగ ధర్మాలుగా మనుస్మృతి చెప్తుంది.

దానము, తపస్సు ఆచరించదగినవే గాని విడువదగినవి కావని శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించాడు. ఈ లోకములో విధి విధానముగా సత్పాత్రునకీయబడిన దానము అక్షయ వట వృక్ష సదృశ్యమైనదని ఆదిశంకరాచార్యులవారి ఉవాచ. నిస్వార్థ భావముతో భగవదర్పణ బుద్ధితోదానం చేసిన భగవత్ప్రాప్తి సిద్ధించును

‘అదాన దోషేణ భవేద్దరిద్రః దరిద్ర దోషేణ కరోతి పాపం, పాపాదవశ్యం నరకం ప్రయాతి, పునర్ధరిద్రః పనరేవ పాపి’ అని గత జన్మలో మనం దానధర్మాలు చేయకపోవడంవల్ల ఈ జన్మలో దారిద్య్రం ప్రాప్తించింది. కనుక దరిద్రపు జీవితం రాకుండా ఉండాలంటే మనకు తోచినది మనదగ్గర ఉన్నదాంట్లోనే ఎంతోకొంత దానంచేయడం ప్రతి మానవుడు తన ధర్మంగా భావించాలి.

వెబ్దునియా పై చదవండి