నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా... నేతల ధిక్కారంపై గవర్నర్ వేదాంతం.. ఇంకా ఏమన్నారు?

సోమవారం, 22 జూన్ 2015 (07:17 IST)
‘‘నేను కర్మయోగాన్ని అనుసరిస్తాను. మనిషి జీవితం లో మూడు యోగాలు ముఖ్యమని కృష్ణుడు చెప్పారు. అవి కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు. వీటిలో ముఖ్యమైనది కర్మయోగం. కర్మ యోగమంటే పని చేయడమే మన అధికారం. దాని ఫలితం ఆశించే అధికారం మనకుండదు. విధులను సక్రమంగా నిర్వహిస్తూపోతే ఫలితం దానంతట అదే వస్తుంది’’ అని ఉమ్మడి గవర్నర్ నరసింహన్ వేదాంతం చెప్పారు. ఆదివారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన నేత ధిక్కార స్వరంపై మీరేమంటారు అన్న ప్రశ్నకు ఆయన స్పందించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
దర్శనం తరువాత ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, తనను శరణాగతి చేస్తే నేను చూసుకుంటా అని స్వామివారు చెప్పినట్లు తన మనసులో అనిపించిందని గవర్నర్ అన్నారు. ఈ రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించి, ప్రజలు సుఖంగా జీవించేలా ఆశీర్వదిస్తానని కూడా స్వామి చెప్పారని అన్నారు. అందుకే ఎలాంటి కష్టాలొచ్చినా ఆపద్బాంధవుడు శ్రీవేంకటేశ్వరుడి దీవెనలతో తొలగిపోతాయి. ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతున్నానని ఆయన వ్యాఖ్యానించారు. 
 
తన సతీమణితో కలిసి ఆదివారం సాయంత్రం ఆయన శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు.  గనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో భాస్కర్‌, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ కలి సి తీర్థప్రసాదాలు, చిత్రపటం, ఆధ్యాత్మిక ప్రచురణలను బహూకరించారు. అనంతరం, టీటీడీ ఏర్పాట్లపై క్యూలైన్లలోని భక్తులతో గవర్నర్‌ ముచ్చటించారు.

వెబ్దునియా పై చదవండి