రాగిపాత్ర మహావిష్ణువుకు ప్రీతికరమైందని శాస్త్రాలు చెప్తున్నాయి. సాధారణంగా లోహాలలో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి దైవానికి ప్రతిరూపాలుగా చెబుతారు. సువర్ణం ఈశ్వరునికి సంబంధించినదైతే.. విష్ణువుకు రాగి ప్రీతికరమైనది. రాగితో చేసిన పాత్రలలో మహావిష్ణువుకు నైవేద్యం పెడితే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని వరాహపురాణం చెప్తోంది.
ఆ పరిశుద్ధమైన లోహంతో తయారైన పాత్రలో ప్రతినిత్యం శ్రీ మహావిష్ణువుకు నైవేద్యం అందేలా వరమివ్వాలని గూడాకేశుడు విష్ణువును ప్రార్థించాడు. గూడాకేశుడిని అనుగ్రహించి విష్ణువు అంతర్థానమయ్యాడు. ఆ తర్వాత కూడా రాక్షసుడు తపస్సును కొనసాగించాడు. వైశాఖశుద్ధ ద్వాదశినాడు శ్రీ మహావిష్ణువు ఆ అసురుడి కోరిక తీర్చాలనుకున్నాడు. అదే రోజున విష్ణువు తన చక్రాన్ని అసురుడిపై ప్రయోగించాడు. వెంటనే అది అతడిని ఖండించింది. అతడి మాంసం తామ్రం అయ్యింది. అతడి శరీరంలోని అస్థికలు వెండి అయ్యాయి. మలినాలు కంచులోహంగా మారిపోయాయి.
తనను జీవితాంతం అలా స్మరిస్తూ ఉన్న భక్తుడి కోరికను తీర్చాడు మహావిష్ణువు. గూడాకేశుడి శరీరం నుంచి ఏర్పడిన తామ్ర లోహంతో ఓ పాత్ర తయారైంది. ఆ పాత్రలో పెట్టిన నైవేద్యమంటే విష్ణువుకు మహా ప్రీతికరమైంది. ఆ తర్వాతే భక్తులు రాగిపాత్రలో పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే విష్ణువు ఆనందంతో స్వీకరించసాగాడు. లోహాల్లో రాగి శ్రేష్ఠమైనదని పురాణాలు చెప్తున్నాయి.