తిరుచానూరు రథసప్తమిలో అపశృతి... ఒరిగిన ఉత్సవ విగ్రహం

సోమవారం, 26 జనవరి 2015 (08:55 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం తమ పరిధిలోని ప్రముఖ ఆలయాలలో ఇవ్వాళ రథసప్తమి నిర్వహిస్తోంది. తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంలతో పాటు అన్ని చోట్ల రథసప్తమి నిర్వహిస్తారు. ఈ  నేపథ్యంలో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి రథసప్తమి ఆరంభమయ్యింది. సోమవారం ఉదయం ఆరంభమైన వాహనసేవలో అపశృతి చోటు చేసుకుంది.

ఉదయం సూర్యప్రభ వాహనంపై పద్మావతీ అమ్మవారు ఊరేగుతుండగా... ఉత్తర మాడవీధిలో వాహనం రాగానే అమ్మవారి ఉత్సవ విగ్రహం ఒక్కసారిగా కుడివైపు ఒరిగింది. గమనించిన అర్చకులు వెంటనే అమ్మవారి విగ్రహాన్ని పట్టుకున్నారు.
 
తిరిగి సరిగా కూర్చోబెట్టడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో విగ్రహాన్ని అలా పట్టుకునే వాహన సేవను నిర్వహించారు. విగ్రహాన్ని సరిగా అమర్చకపోవడం వల్లే అలా జరిగినట్టు డిప్యూటీ ఈవో చెంచులక్ష్మి వివరించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా పద్మావతీ అమ్మవారు ఏడు వాహనాల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

వెబ్దునియా పై చదవండి