ఆర్టీసీ సమ్మెతో ఇక్కట్లు పడుతున్న తిరుమల భక్తులు.. కిక్కిరిసిన రైల్వే స్టేషన్

బుధవారం, 6 మే 2015 (21:26 IST)
ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెతో తిరుమల భక్తులు ఇక్కట్ల పాలయ్యారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లి వచ్చిన భక్తులు బస్టాండు చేరుకోవడానికి, గమ్యస్థానాలకు వెళ్లడానికి నానా అగచాట్లు పడుతున్నారు. చిత్తూరు జిల్లాలోని 14 డిపోలకు చెందిన 1450 బస్సులు పూర్తిగా డిపోలకే పరిమితమయ్యాయి.
 
తిరుమల డిపోకు సమ్మె మినహాయింపు ఉన్నప్పటికీ 50శాతం బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. తిరుమల నుంచి ఇతర ప్రాంతాలకు నడిచే బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి.  తిరుమల-తిరుపతి మధ్య మాత్రమే నడుపుతున్నారు. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి కాకుండా అలిపిరి బాలాజీ బస్టాండ్‌ వరకు మాత్రమే బస్సులు నడుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
అక్కడ నుంచి భక్తుల అగచాట్లు వర్ణణాతీతం రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ నుంచి వచ్చిన రైలెక్కి వారి గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. కొందరైతే అధిక అద్దెలకు టాక్సీలను మాట్లాడుకుని ప్రయాణిస్తున్నారు. ఇక ప్రైవేటు ఆపరేటర్లు భక్తులను దోచుకుంటున్నారు. 
 

వెబ్దునియా పై చదవండి