"హోలీ"కి కాముని పున్నమిగా పేరేలా వచ్చిందంటే..?

WD
పురాణాల ప్రకారం దక్షయజ్ఞ సమయంలో అగ్నికి ఆత్మాహుతి అయిన సతీదేవి, హిమవంతుని కుమార్తెగా జన్మిస్తుంది. ఆమెకు పార్వతి దేవీ అనే నామధేయము చేస్తారు. సతీదేవీ వియోగ దుఃఖముతో పరమేశ్వరుడు నిరంతర తపోదీక్షలో నిమగ్నమై ఉండగా, ఆ స్వామిని పార్వతీ దేవీ అనునిత్యము పూజిస్తూ సపర్యలు చేస్తూ ఉంటుంది. దేవతలందరూ పార్వతీ, పరమేశ్వరులకు వివాహం చేయదలచి మన్మథుడిని ఆశ్రయిస్తారు.

ఇలా.. దేవతల కోరిక మేరకు దైవకార్యానికి అంగీకరించిన మన్మథుడు పార్వతీదేవి పరమేశ్వరుడికి సపర్యలు చేసే సమయంలో మన్మథ బాణాన్ని (పూలబాణాన్ని) శివుడిపై ప్రయోగిస్తాడు. దీంతో "పార్వతీ పరమేశ్వరుల" కళ్యాణానికి మన్మథుడు కారణభూతుడవుతాడు. కానీ ఈ విషయాన్ని దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్న పరమేశ్వరుడు తన మూడవనేత్రముతో మన్మథుడిని భస్మం చేస్తాడు.

దీంతో మన్మథుడి సతీమణి రతీదేవి పార్వతీ పరమేశ్వరులకు "పతిభిక్ష" పెట్టమని వేడుకోగా, సర్వమంగళ స్వరూపిణి అయిన పార్వతి దేవి, ఈశ్వరుని అనుగ్రహంతో మన్మథుడిని శరీరరూపంలో సజీవుడిని చేసి రతీదేవికి మాంగల్య భాగ్యం అనుగ్రహిస్తుంది. ఆ రోజునే ఫాల్గుణ పూర్ణిమ కావున హోలీనీ "కాముని పున్నమి"గానూ జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి