ధోనీ సేన విజృంభణ: 28 ఏళ్ల తర్వాత భారత్ కల సాకారం

శనివారం, 2 ఏప్రియల్ 2011 (23:24 IST)
WD
121 కోట్ల భారతావని హృదయం పులకించిన వేళ... 28 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారం చేసుకున్న వేళ... శతకోటి కళ్లు ఆనందంతో చమర్చిన వేళ... 40 వేల మంది ప్రత్యక్షంగానూ, కోట్లమంది పరోక్షంగానూ వీక్షించిన ప్రపంచకప్ 2011లో భారత జట్టు ఘన విజయం సాధించి ఛాంపియన్స్‌గా అవతరించింది.

ఈ అద్భుత విజయంతో టీమిండియా ఆటగాళ్లు ఉద్వేగానికి లోనై ఆనంద భాష్పాలను రాల్చారు. ఆ మాటకొస్తే మ్యాచ్ చూసిన ప్రతి ఇండియన్ కళ్ల వెంట ఈ ఆనందకర క్షణాల తాలూకు ధోనీ సేన విధ్వంసకర ఇన్నింగ్స్ ముందు లంక జట్టు తలవంచి రన్నరప్‌గా నిలిచింది.

శ్రీలంక నిర్దేశించిన 275 విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వీరేంద్ర సెహ్వాగ్(0), సచిన్ టెండూల్కర్ ( 18) వికెట్లను త్వరత్వరగా కోల్పోయి భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ దశలో బరిలోకి దిగిన గౌతమ్ గంభీర్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

9 ఫోర్లతో అమూల్యమైన 97 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లి గంభీర్ కు చక్కని సహకారాన్ని అందించాడు. ఇద్దరూ కలిసి కుదురుగా ఆడుతున్నారనుకున్న సమయంలో దిల్షాన్ ప్రమాదకరమైన బంతి కోహ్లి వికెట్ ను బలి తీసుకుంది. ఈ దశలో భారత స్కోరు 114 పరుగులు.

ఈ ఒత్తిడి తట్టుకోలేననుకున్నాడో ఏమోగానీ, టీమిండియా కెప్టెన్ ధోనీ యూవీకి బదులు తనే రంగంలోకి దిగాడు. బరిలోకి దిగిన దగ్గర్నుంచి లంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మలింగను సైతం వీర బాదుడు బాదాడు. గంభీర్ సహకారం ఇస్తున్నాడనుకున్న దశలో అతని వికెట్‌ను పెరేరా తీసుకున్నాడు.

ఆ దశలో జట్టు స్కోరు 223. గంభీర్ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ ధోనీకి చక్కటి సహకారం అందించాడు. దీంతో 48.2 ఓవర్ లో సిక్సర్ తో ప్రపంచకప్ ను భారత్ కు అందించాడు కెప్టెన్ ధోనీ. టీమిండియాకు హ్యాట్సాఫ్...

వెబ్దునియా పై చదవండి