భారత "గజరాజులు" వర్సెస్ లంక "సింహాలు": గెలుపెవరిదో...?!!

శుక్రవారం, 1 ఏప్రియల్ 2011 (15:03 IST)
ND
ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌లతో జరిగిన క్వార్టర్ ఫైనల్, సెమీస్ మ్యాచ్‌ల మీద ఉన్నంత ఉత్కంఠ, ఆసక్తి శ్రీలంకతో జరిగే ఫైనల్‌పై లేనప్పటికీ ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ మధ్య జరిగే సమరంపైనా సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో ఇరు జట్ల ప్రదర్శన, బలాబలాలు పరిశీలిస్తే ఇరు జట్లు తమపై ఉన్న అంచనాకు తగ్గట్లు ఆడితే శనివారం వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, సురేష్ రైనాలు మంచి ఫామ్‌లో ఉండటంతో భారత్ బ్యాంటింగ్ బలంగా వుండగా శ్రీలంక బౌలర్లు మురళీధరన్, లసిత్ మలింగా, అజంతా మెండిస్‌లు ప్రపంచంలో ఏ దేశ బ్యాటింగ్ లైనప్‌ను అయినా తుత్తునీయం చేయగల సమర్ధులు. ఈ అతిపెద్ద సమరానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరు జట్ల బలాలు, బలహీనతలు ఒకసారి చూద్దాం..!

బ్యాటింగ్ : భారత్ జట్టు పేపర్‌పై బలంగా ఉంది.. ఆటలో మాత్రం....

శ్రీలంకతో పోలిస్తే ఇండియా బ్యాటింగ్ లైనప్ ఎంతో బలంగా ఉంది, గణాంకాలు పరిశీలిస్తే శ్రీలంకపై చాలా తక్కువ సందర్భాల్లో భారత జట్టు పేలవ ప్రదర్శన చూపింది. ఈ టోర్నీలో భారత బ్యాట్స్‌మెన్ 2194 పరుగులు చేయగా శ్రీలంక బ్యాట్స్‌మెన్ 1933 పరుగులు చేశారు. అయితే ఇండియా ప్రత్యర్థులకు 58 వికెట్లను సమర్పించగా లంకేయులు 40 వికెట్లు మాత్రమే కోల్పోయారు.

ఓపెనింగ్ జంట :
భారత ఓపెనింగ్ జోడి వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్ ఇచ్చే ఆరంభంపై జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ కప్ టోర్నీ మొత్తం మీద ఈ జంట సగటున 53.9 పరుగుల ఆరంభాన్ని ఇచ్చింది. అయితే లంకేయుల ఓపెనింగ్ జోడి చేసిన సగటు 97.9 పరుగులు. ఈ లెక్కన చూస్తే ఫైనల్‌లో మన ఓపెనర్లు బాగా రాణించాల్సి ఉంటుంది.

మిడిల్ ఆర్డర్ :
మిడిల్ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్ ఇరుజట్ల సగటు బాగా ఉంది. ఇరు దేశాలు మిడిల్ ఆర్డర్‌లో మంచి బ్యాట్స్‌మెన్ కలిగివున్నాయి.

లోయర్ ఆర్డర్ :
శ్రీలంక లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే భారత చివరివరుస బ్యాట్స్‌మెన్ ఎక్కువ పరుగులు చేశారు. ఈ టోర్నీలో భారత లోయర్ బ్యాట్స్‌మెన్ 304 పరుగులు చేయగా, లంక చివరి ఆటగాళ్లు 172 పరుగులు చేశారు.

భారత బౌలర్లు అనుసరించాల్సిన వ్యూహం :
శ్రీలంక ఓపెనర్లు, టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ భాగస్వామ్యం ఏర్పరచటానికి ప్రయత్నిస్తారు, భాగస్వామ్యాలు ఏర్పడకుండా వారిని అవుట్ చేయాలి.

బౌలింగ్ : లంకేయులదే పైచేయి
PTI

బౌలింగ్ విభాగంలో లంకేయులదే పైచేయి. ఏడు ఇన్నింగ్స్‌లలో లంక బౌలర్లు 1328 పరుగులే ప్రత్యర్థి జట్లకు ఇవ్వగా, భారత బౌలర్లు ఏకంగా 1996 పరుగులు సమర్పించుకున్నారు. అయితే భారత్ ఊపిరి పీల్చుకునే అంశం ఏమిటంటే ఇరు జట్ల బౌలర్లు సగటున ప్రతి మ్యాచ్‌లో 9 వికెట్లు తీశారు.

పేస్ బౌలింగ్ :
శ్రీలంక బౌలింగ్ బలం స్పిన్ బౌలింగే, ఈ టోర్నీలో వారి పేస్ బౌలర్లు 113 ఓవర్లు బౌలింగ్ చేయగా భారత పేస్ బౌలర్లు 157 ఓవర్లు వేశారు. కాగా భారత్ పాస్ట్ బౌలర్లు లంకేయుల కంటే ఎక్కువ వికెట్లు సాధించారు.

స్పిన్ బౌలింగ్ :
శ్రీలంక ప్రపంచంలోనే ఉత్తమ స్పిన్ బౌలింగ్‌ని కలిగి ఉంది. స్పిన్ విభాగంలో లంకేయుల ఎకానమీ 3.79 అయితే ఇండియాది 4.86.
ఇలా నువ్వంటే నువ్వన్నట్లున్న భారత్ - శ్రీలంక జట్లు రేపు ఫైనల్ మ్యాచ్ లో ఢీకొనబోతున్నాయి. ప్రపంచకప్ 2011ను మన టీమిండియా కైవసం చేసుకోవాలని కోరుకుందాం.