గాంధీజీతో ప్రశంసలందుకున్న తెలుగు బిడ్డ కాశీనాథుడు

WD PhotoWD
తెలుగు భాషకు, తెలుగు జాతికి ఎనలేని సేవ చేసిన వారిలో కాశీనాథుని నాగేశ్వరరావు ఒకరు. ఈయన భారత స్వాతంత్ర్యంలో కీలక పాత్రను పోషించారు. రాష్ట్రంలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా గ్రంథాలయాల విస్తరణకు విశేష కృషి చేసిన విద్యావేత్త. దానశీలి, జాతిపిత పలుకులను ఆశయ సాధనగా చేసుకుని ఖాదీ ఉద్యమాన్ని ముందుండి నడిపి మహనీయుడు. కృష్ణ జిల్లా ఎలకుర్తి గ్రామంలో లో బుచ్చయ్య-శ్యామలాంబ దంపతులకు 1867 మే ఒకటో తేదీన ఈయన జన్మించారు. నాగేశ్వరరావు పెద్ద చదువులు అభ్యసించలేక పోయిన ఆంధ్ర పత్రిక, అమృతాంజనం సంస్థలను స్థాపించారు.

అనంతరం ఆంధ్రపత్రిక, భారతి, ఆంధ్ర గ్రంధాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేశారు. తన వ్యాపారాల ద్వారా సంపాందించిన అస్తిపాస్తులను పేద ప్రజల ఉద్ధరణకు వెచ్చించారు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ స్వయంగా గాంధీ మహాత్ముడే మెచ్చుకున్నారు. ప్రస్తుత తమిళనాడు రాజధాని చెన్నైలోని నాగేశ్వరరావు నివాసమైన శ్రీబాగ్‌‌లోనే చారిత్రాత్మక శ్రీబాగ్‌ ఒడంబడిక కుదిరింది. కోస్తా, రాయలసీమ నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.

పత్రికా రంగంలో విశిష్టం సేవలు
సూరత్‌లో 1907లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సభలో పాల్గొన్న తరువాత ఆయన తెలుగువారికి తెలుగులో వార్తా సమాచారాలను అందించాలన్న అవసరాన్ని గుర్తించారు. పత్రికా రంగంలో నాగేశ్వరరావు ప్రవేశం పాశ్చాత్య దేశాలలో పులిట్జర్ ప్రయత్నంతో పోల్చవచ్చును. అప్పుడే విస్తరిస్తున్న దేశీయ పత్రికలపై ఆంగ్లేయుల ప్రభుత్వం ధోరణి వ్యతిరేకంగా ఉండేది. 1908లో బొంబాయి నుంచి ఆయన ప్రారంభించిన ఆంధ్ర పత్రిక వార పత్రిక తెలుగువారికి గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.

నాగేశ్వరరావు వ్యాసాలు ఆయన సామాజిక చేతనా ధృక్పధాన్నీ, సమకాలీన చరిత్రపై ఆయన అవగాహననూ ప్రతిభింబించాయి. 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనపుడు ప్రపంచంలో మారుతున్న పరిస్థితులనూ, రాజకీయ పరిణామాలనూ తెలుగువారికి తమ స్వంత భాషలో అందించాలనే ఉద్దేశ్యంతో ఆంధ్ర పత్రిక దిన పత్రికను ప్రారంభించారు. పత్రికారంగంలోనే కాక ప్రచురణారంగంలో కూడా నాగేశ్వరరావు తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్నారు.

1926లో 'ఆంధ్ర గ్రంధమాల' అనే పుస్తక ప్రచురణ సంస్థను ప్రారంభించాడు. ఈ సంస్థ 20పైగా పుస్తకాలు ప్రచురించింది. ఇంకా అనేక ప్రాచీన గ్రంధాలను పునరుద్దరించింది. సామాన్యులకు అందుబాటులో ఉండాలని ఈ పుస్తకాల వెలను చాలా కొద్దిమొత్తంగా నిర్ణయించారు. తెలుగునాట గ్రంధాలయోద్యమానికి నాగేశ్వరరావును పితామహునిగా వవర్ణించవచ్చును.

సమస్త మానవాళికీ గీత ఆదర్శనీయ
ఉప్పు సత్యాగ్రహ సందర్భంగా 1931లో ఒక సంవత్సరం జైలులో ఉన్నపుడు నాగేశ్వరరావు భగవద్గీతపై కొన్ని వ్యాఖ్యలు కూడా రాశారు. గీత ఒక మతానికి పరిమితమైనది కాదనీ, దాని సందేశం సమస్తమానవాళికీ వర్తిస్తుందనీ ఆయన పేర్కొన్నారు.

విశ్వదాతగా కొనియాడిన గాంధీజ
నాగేశ్వరరావు అసమాణ దానశీలి. ఆయన ఇల్లు ఎప్పుడూ అతిధులతోనూ, అర్ధులతోనూ కళకళలాడుతుండేది. వివిధ సేవఅ కలాపాలకు ధారాళంగా ఆయన సహాయం చేస్తుండేవాడు. ఆయన ఇంటినుండి వట్టిచేతులతో ఎవరూ వెళ్ళేవారు కాదు. ఆయన దాతృత్వానికి అబ్బురపడి మహాత్మా గాంధీ ఆయనను విశ్వదాత అని కొనియాడాడు. ఇలా తెలుగు భాషకు, తెలుగుజాతికి సేవ చేసిన కాశీనాథుని నాగేశ్వరరావు 1938 లో మరణించారు. తెలుగు జాతికీ, తెలుగు భాషకూ, తెలుగు సంస్కృతికీ ఆయన చేసిన సేవ ఎనలేనిది. మరువలేనిది.

వెబ్దునియా పై చదవండి