శివరాత్రితో చలికాలం శివశివ అంటూ వెళ్లిపోతుందన్నది పెద్దల మాట. వాస్తవానికి ఈ యేడాది శివరాత్రి పోకమునుపే పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. అనంతపురంతో పాటు తెలంగాణాలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే, వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు ఏసీలను అత్యధికంగా వినియోగిస్తుంటారు. దీంతో వేసవి కాలంలో ఏసీల వాడకంతో పాటు.. విక్రయాలు జోరుగా సాగుతాయి. అయితే, ఏసీలు కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలను విధిగా తెలుసుకోవాలి. అవేంటంటే...
ఏసీ కాయిల్స్ తుప్పు పట్టకుండా (కొరిజన్ ప్రొటెక్షన్) కోటింగ్ రక్షణ ఉందో లేదో గమనించాలి. బ్లూఫిన్ కండెన్సర్ లేదా మైక్రో చానల్ కండెన్సర్ అయితే మేలు. కొన్ని కంపెనీలు తయారు చేసే ఏసీల్లో అదనంగా వాటర్ కూల్డ్ కండెన్సర్‌ను అందిస్తున్నాయి. మిగతావాటితో పోల్చితే ఈ ఏసీలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలోనూ మెరుగైన చల్లదనాన్ని అందిస్తాయి. అయితే నీటిని వినియోగించాల్సి వస్తుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు ఎంచుకోవడం ఎంతో ఉత్తమం.