నెయిల్ పాలిష్‌ను ఇలా కూడా వాడుకోవచ్చు..

గురువారం, 20 ఏప్రియల్ 2017 (11:15 IST)
నెయిల్‌పాలిష్‌ బాటిల్స్ వాడకుండా అలానే సెల్ఫ్‌ల్లో ఉండిపోతున్నాయా? అయితే ఏం ఫర్లేదు. వాటిని కేవలం గోళ్లకే మాత్రమే కాకుండా.. రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే..? వంటింటిలో రకరకాల డబ్బాలను వరుసగా పేరుస్తుంటాం. కానీ ఏ డబ్బాలో ఏముందో తెలుసుకోవడం కోసం కాస్త తికమకపడుతుంటాం. అందుకని ప్రతి డబ్బా మీద వాటి పేర్లను నెయిల్ పాలిష్‌తో రాయడం ద్వారా సులభంగా గుర్తించవచ్చును.
 
పిల్లల ఆటబొమ్మలు, వస్తువులు పాతవయ్యాక మూలన పడేస్తుంటారు. ఈ సెలవుల్లో వాటి దుమ్ముదులిపి.. రంగురంగుల నెయిల్‌పాలిష్‌లతో రంగులు అద్దమనండి. అది పిల్లలకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. సృజనాత్మకత పెరుగుతుంది.
 
అలాగే పాత పూసల దండలను కూడా పారేయకండి. వాటిలో కొన్ని రంగులు వెలిసిపోయినా ఫర్వాలేదు. రోజు వేసుకునే డ్రెస్‌ కలర్‌కు మ్యాచ్‌ అయ్యే నెయిల్‌పాలిష్‌ను పూసలదండకు వేస్తే.. కొత్తగా అనిపిస్తాయి. వాటికి దుస్తుల రంగులకు తగ్గట్టు వాడుకోవచ్చు.  
 
ఇంట్లో ఆల్మారా దగ్గర నుంచి డెస్క్‌ వరకు అన్ని తాళంచెవులు ఒకేలా ఉంటాయి. చాలాసార్లు ఆ తాళానికి ఏ చెవో గుర్తించడం కష్టం. అందుకని మీరు నెయిల్‌ పాలిష్‌ కలర్స్‌ను కీస్‌కు పూయండి. అప్పుడు గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది.

వెబ్దునియా పై చదవండి