పాక్ వాయువ్య ప్రాంతంలో పేలుళ్ళు: 20 మంది మృతి

మంగళవారం, 10 నవంబరు 2009 (20:32 IST)
పాకిస్థాన్ వాయువ్య ప్రాంతంలోని ఛర్స్ అడ్డా పట్టణంలో మంగళవారం భారీ పేలుడు సంభవించడంతో 20 మంది మృతి చెందారు.

పాకిస్థాన్ దేశంలోని వాయువ్య ప్రాంతంలోనున్ఛర్స్ అడ్డా పట్టణంలోని రద్దీ ఎక్కువగానున్న వ్యాపార కూడలి ఫరూక్-ఏ-ఆజమ్ చౌక్ వద్ద మంగళవారం సాయంత్రం గం. 4.20లకు భారీ పేలుడు సంభవించిందని, ఈ పేలుడు కారణంగా 20 మంది మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.

పేలుడు జరిగిన సందర్భంలో రద్దీ ఎక్కువగా ఉండిందని, ఇందులో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా పలువురికి తీవ్ర గాయాలైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీంతో దేశవ్యాప్తంగా తాలిబన్ ఉగ్రవాదులపై నిఘా మరింత తీవ్రతరం చేశారని భద్రతా బలగాలు పేర్కొన్నాయి.

ఈ పేలుడు కారణంగా చాలా దుకాణాలు, కార్లు, ఇతర వాహనాలతోపాటు ఓ ఛానెల్‌కు చెందిన కార్యాలయం కూడా దెబ్బతిందని స్థానిక మీడియా తెలిపింది.

తీవ్ర గాయాలపాలైన వారిలో అత్యధికులు పాఠశాల విద్యార్థులున్నారని, గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

పేలుడు ఎక్కడ సంభవించిందనేది స్పష్టంగా చెప్పలేమని, బహుశా అది కారు బాంబు అయి వుండవచ్చని తాము అనుమానిస్తున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

వెబ్దునియా పై చదవండి