ప్రతీకార చర్యలు వద్దు: కెవిన్ రూడ్

భారతీయులతో సహా, విదేశీ విద్యార్థులపై ఆస్ట్రేలియా నగరాల్లో జరుగుతున్న దాడులు విచారకరమని ఆ దేశ ప్రధానమంత్రి కెవిన్ రూడ్ పేర్కొన్నారు. అయితే వీటికి ప్రతీకార చర్యలు కూడా తమ ప్రభుత్వం సహించబోదని రూడ్ హెచ్చరించారు. పట్టణ జీవితంలో ఇటువంటి దాడులు విచారకరమని వ్యాఖ్యానించిన కెవిన్ రూడ్ ఆస్ట్రేలియాలో విద్యార్థులపై దాడులను ఉపేక్షించమన్నారు.

ఈ హింసాకాండ అంగీకారయోగ్యం కాదని చెప్పారు. తమపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థి వర్గం ప్రతీకార చర్యలకు పూనుకుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో రూడ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారతీయ విద్యార్థులపై జాతివివక్ష ప్రదర్శించిన ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు ఆస్ట్రేలియా మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

విదేశీ విద్యార్థులకు తమ దేశం సురక్షితమైన ప్రదేశమని రూడ్ తెలిపారు. విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడులతోపాటు, ప్రతీకార చర్యలను కూడా తమ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేవారిని కూడా దాడులు చేసేవారితో సమానంగా పరిగణిస్తామని రూడ్ వ్యాఖ్యానించారు. విదేశీ విద్యార్థుల తమ ఇబ్బందులను పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అక్కడ న్యాయం జరగలేదని భావిస్తే, స్థానిక పార్లమెంట్ సభ్యులను ఆశ్రయించాలని కోరారు.

వెబ్దునియా పై చదవండి