అణు ఒప్పందం భారత్‌కే అనుకూలం: న్యూయార్క్ టైమ్స్

ఆదివారం, 5 ఆగస్టు 2007 (19:50 IST)
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం వల్ల భారతదేశానికే ఎక్కువ లాభాలు ఉన్నాయని ప్రముఖ పత్రిక న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఈ మేరకు ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు మధ్య జరిగిన 123 ఒప్పంద చర్చల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఆ పత్రిక ప్రకటించింది. ఈ అణు ఒప్పందం వల్ల భారత్‌ ఎక్కువగా లబ్ధి పొందుతుంది. ఈ ఒప్పందం అమలులో ఉన్నపుడు తమ అణ్వాయుధాల సంపత్తిని పెంచుకోకూడదనే నిబంధన ఏదీ 123 ఒప్పందంలో చేర్చలేదని పేర్కొంది.

అంతేకాకుండా తమ దేశ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లే పక్షంలో అణు పరీక్షలు సైతం నిర్వహించుకునేలా ఒప్పందం కుదిరిందని, ఇది భారత్‌కు ప్రధాన మేలులాంటిదని పేర్కొంది. ముఖ్యంగా భారత్‌కు అవసరమైన యురేనియంతో పాటు.. ఇతర ఇంధనాలు ఇతర దేశాల నుంచి సరఫరా చేసేందుకు అమెరికా కృషి చేస్తుందని పేర్కొంది. అయితే భారత్‌కు కావాల్సిన ఇంధనం ఎంతమేరకు అనే విషయాన్ని ఇందులో స్పష్టం చేయలేదని న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో అణు ఒప్పందం వల్ల ఇరు దేశాలకు చేకూరే లాభనష్టాలను ప్రధానంగా పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి