అణు ఒప్పందం: సెనేట్‌లో నేడే ఓటింగ్

బుధవారం, 1 అక్టోబరు 2008 (11:13 IST)
FileFILE
భారత్-అమెరికా అణు ఒప్పందంపై అమెరికా సెనేట్‌లో బుధవారం ఓటింగ్ జరగనుంది. అమెరికా ప్రతినిధుల సభ మూడు రోజుల క్రితం పౌర అణు ఒప్పందాన్ని పూర్తి మెజారిటీ -297-117- ఓట్లతో ఆమోదించిన విషయం తెలిసిందే. బుధవారం రైల్వే భద్రతా బిల్లుపై ఓటింగ్ జరిగన తర్వాత సెనేట్ అణు ఒప్పందంపై ఓటింగ్‌ను చేపడుతుందని సెనేట్ మెజారిటీ నేత హారీ రీడ్ చెప్పారు.

అణు ఒప్పందంపై పరిశీలన అనంతరం సెనేట్‌లో బుధవారమే ఈ అంశంపై ఓటింగ్ జరగవచ్చని రీడ్ తెలిపారు. ఈ బిల్లును సెనేట్ ఆమోదించిన తర్వాత ఇరు దేశాలు ఈ ఒప్పందంపై తుది సంతకాలు చేస్తాయని రీడ్ పేర్కొన్నారు.

అంతకుముందు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ మాట్లాడుతూ, అక్టోబర్‌లో సెనేట్ రద్దు కాకముందే అణు ఒప్పందాన్ని పరిశీలించి, వీలైనంత త్వరగా ఆమోదించాలని సెనేట్‌ను కోరారు. ఈ బిల్లును ఆమోదిస్తే భారత్‌తో అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడంలో సహాయపడుతుందని బుష్ పేర్కొన్నారు.

అమెరికా అధికార వర్గాల సమాచారం ప్రకారం విదేశీ శాఖ మంత్రి కాండోలిజా రైస్ శుక్రవారం ఢిల్లీని సందర్శించనున్నారు. భారత విదేశీ మంత్రి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఆమె అణు ఒప్పందంపై సంతకాలు చేయవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి