అధ్యక్షుని అధికారాల్లో కోత విధించిన పాక్ ప్రభుత్వం

శుక్రవారం, 9 ఏప్రియల్ 2010 (09:57 IST)
పాకిస్థాన్‌ అధ్యక్షుడి అధికారాల్లో కోత విధిస్తూ చరిత్రాత్మక రాజ్యాంగ సవరణ బిల్లును జాతీయ అసెంబ్లీ గురువారం 2/3 మెజారిటీతో ఆమోదించింది. మాజీ సైనిక పాలకుడు ముషారఫ్‌ దేశ రాజ్యాంగానికి గతంలో చేసిన మార్పులను సరిదిద్దింది. దాంతో పాక్‌ అధ్యక్షుడు ఆసిఫ్‌ అలీ జర్దారీ నామమాత్రపు అధ్యక్షుడు కానున్నారు.

పాకిస్థాన్‌ రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చేసి, అపహాస్యం చేసిన సైనిక నియంతలు జియా ఉల్‌హక్‌, ముషారఫ్‌లకు వ్యతిరేకంగా పిక్కటిల్లిన నినాదాల మధ్య జాతీయ అసెంబ్లీ సభ్యులు మొత్తం 102 రాజ్యాంగ సవరణలను ఆమోదించారు.

ప్రభుత్వం చేపట్టిన ఈ సవరణలతో అధ్యక్షుడికి సొంతమైన పలు కీలక అధికారాలు ప్రధానమంత్రికి దక్కనున్నాయి. జాతీయ అసెంబ్లీలోని 342 మంది సభ్యుల్లో 292 మంది ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. నిజానికి 228 మంది అనుకూలంగా ఓటేస్తే చాలు. ఒక్కరూ వ్యతిరేకిస్తూ ఓటేయకపోవడం గమనార్హం. ఇదిలావుండగా కొందరు సభ్యులు సభలో ఉండి ఓటింగ్‌కు దూరంగా ఉండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి