అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన హైతీ ప్రెసిడెంట్!

బుధవారం, 10 మార్చి 2010 (16:38 IST)
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో హైతీ ప్రెసిడెంట్ రీనె ప్రీవల్ బుధవారం సమావేశమయ్యారు. భారీ భూకంపం బారిన పడిన హైతీని ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఒబామాకు విజ్ఞప్తి చేశారు. కరేబియన్ దేశమైన హైతీలో గత 12వ తేదీన వచ్చిన భారీ భూకంపం వల్ల వందలాది మంది మృత్యువాత పడగా, వేలాది మంది నిరాశ్రయులైన విషయం తెల్సిందే.

దీంతో హైతీకి ఆపన్నహస్తం అందించేందుకు పలు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. అత్యంత పేదరిక దేశమైన హైతీని ఈ భారీ భూకంపం తీవ్రంగా నష్టపరిచింది. ఈ భూకంప ప్రభావం ధాటికి హైతీ రాజధాని పోర్ట్ ఆఫ్ ప్రిన్స్ 70 శాతం మేరకు దెబ్బతింది.

ఈ భూకంపంపై స్పందించిన ఐక్యరాజ్యసమితి, అమెరికాలు హైతీయాను ఆదుకోవాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశాయి. తమ వంతు సాయంగా కొంత మొత్తంలో నిధులు కూడా ప్రకటించాయి. అలాగే, హైతీ డోనర్స్ కాన్ఫెరెన్స్‌ పేరిట ఒక సదస్సును ఈనెల 31వ తేదీన న్యూయార్క్‌లో నిర్వహించనున్నాయి.

ఈ నేపథ్యంలో, హైతీ అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆ దేశ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌తో భేటీ అయ్యారు. ఇందులో భాకంప సహాయ చర్యలు పూర్తయ్యాక వీలైనంత త్వరగా హైతీలో ఎన్నికలు నిర్వహించాలని ఆమె కోరారు.

కాగా, హైతీలో శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించాల్సి ఉంది. అయితే, జనవరి 12వ తేదీన సంభవించిన భూకంపం వల్ల ఈ ఎన్నికలను వాయిదా వేశారు. దేశ రాజధానిలోని భవనాలు, గృహాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. దీంతో లక్షలాది మంది హైతీ వాసులు నిరాశ్రయులయ్యారు.

వెబ్దునియా పై చదవండి