ఆఫ్ఘన్ ఎన్నికలు: విజయానికి చేరువలో కర్జాయ్

ఆఫ్ఘనిస్థాన్‌లో గత నెల 20న జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో.. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ విజయపథంలో నడుస్తున్నారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో కర్జాయ్ మరోమారు ఎన్నికలు అవసరం లేకుండా విజయం సాధించేందుకు స్పష్టమైన సంకేతాలు వచ్చాయి.

ఇదిలా ఉంటే ఐక్యరాజ్యసమితి మద్దతు ఉన్న ఓ ఎన్నికల పర్యవేక్షణా సంస్థ ఎన్నికల ఫలితాల లెక్కింపులో అక్రమాలు జరిగాయని ఆరోపించింది. ఇందుకు తమకు స్పష్టమైన ఆధారాలు దొరికాయని తెలిపింది. పాక్షిక రీకౌంటింగ్‌కు పిలుపునిచ్చింది. తాజాగా ఆఫ్ఘనిస్థాన్ స్వతంత్ర ఎన్నికల సంఘం వెల్లడించిన ఫలితాల ప్రకారం.. కర్జాయ్‌కు విజయానికి అవసరమైన 50 శాతం ఓట్లు దాటిపోయారు.

కర్జాయ్ ఖాతాలో ఇప్పుడు 54.1 శాతం ఓట్లు ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి కర్జాయ్‌కు తుది ఫలితాల్లో 50 శాతం ఓట్లు ఉండాలి. ఇప్పటివరకు 91.6 శాతం పోలింగ్ కేంద్రాల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఇదిలా ఉంటే కర్జాయ్ ప్రధాన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లాకు 28.3 శాతం ఓట్లు లభించాయి.

వెబ్దునియా పై చదవండి