ఉత్తర కొరియాపై జపాన్ ఆంక్షలు పొడిగింపు

ఉత్తర కొరియాపై మరో ఏడాది పాటు ఆర్థిక ఆంక్షలు కొనసాగిస్తామని జపాన్ ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దిగుమతులు, నిధుల బదిలీలపై నిషేధంతోపాటు ఇతర ఆర్థిక ఆంక్షలు మరో ఏడాది పొడిగించాలని నిర్ణయించినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది.

అంతర్జాతీయ ఒత్తిళ్లను పట్టించుకోకుండా ఇటీవల ఉత్తర కొరియా రాకెట్ ప్రయోగాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి స్పందనగా ఉత్తర కొరియాపై ఆంక్షలను పొడిగించామని జపాన్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రయోగంలో తాము ఓ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టామని ఉత్తర కొరియా చెబుతున్న సంగతి తెలిసిందే.

అయితే జపాన్, దక్షిణ కొరియా, అమెరికా ప్రభుత్వాలు మాత్రం ఉత్తర కొరియా గత ఆదివారం ఖండాతర క్షిపణి పరీక్షను నిర్వహించిందని భావిస్తున్నాయి. అంతేకాకుండా ఉత్తర కొరియా చెబుతున్నట్లుగా కక్ష్యలోకి కొత్త ఉపగ్రహమేదీ వచ్చి చేరలేదని అమెరికా మిలటరీ వెల్లడించింది. దీనికి సంబంధించి ఉత్తర కొరియాపై చర్యలు తీసుకునేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రయత్నిస్తోంది.

వెబ్దునియా పై చదవండి