ఐఎస్ఐ కార్యాలయంలో పేలుళ్ళు: 12 మంది మృతి

మంగళవారం, 8 డిశెంబరు 2009 (19:51 IST)
పంజాబ్ ప్రాంతంలోనున్న ముల్తాన్ ఛావనీలో ఐఎస్ఐ కార్యాలయంలో మంగళవారం రెండు పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళ కారణంగా 12 మంది మృతి చెందగా మరో 11 మందికి తీవ్ర గాయాలైనాయి.

పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలోని ముల్తాన్ ఛావనీలోనున్న ఐఎస్ఐ కార్యాలయంలో మంగళవారం మధ్యహ్నం వరుసగా రెండు పెలుళ్ళు జరిగాయని, ఇందులో 12 మంది మృతి చెందినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

పేలుళ్ళ కారణంగా మరో 11 మందికి తీవ్ర గాయాలైనాయని, గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు తొలుత ఓ సారి పేలుడు జరిగిందని, కాసేపయ్యాక మరో సారి పేలుడు సంభవించిందన్నారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన వారికి సహాయక చర్యలు చేపట్టారు. కాగా మీడియాను సంఘటనా స్థలానికి పోలీసులు అనుమతించకపోవడం గమనార్హం.

పేలుళ్ళ కారణంగా మృతి చెందిన వారిలో ఇద్దరు పిల్లలు, నలుగురు మహిళలున్నారని పోలీసులు తెలిపారు.

ఇదిలావుండగా స్థానిక జంగ్ పత్రికా సంపాదకుడు సంఘటన జరిగినప్పుడు అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... కుట్రదారులు ఐఎస్ఐ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని పేల్చారని, ఇందులో కార్యాలయంలోని సగభాగానికి పైగా దెబ్బతినిందని ఆయన అన్నారు.

పేలుడు సంభవించినప్పుడు భవంతి గాలిలోకి ఎగరడం తాను చూసానని ఆయన తెలిపారు. చుట్టుపక్కల ఉన్న భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని ఆయన వివరించారు. కాగా జియో న్యూస్ ఛానెల్ మొబైల్ పోన్‌తో చిత్రీకరించిన వీడియో క్లిప్పింగ్‌ను ప్రాసారం చేసింది. అందులో పేలుడు కారణంగా భవనం దెబ్బ తిన్న దృశ్యం చూపించడం జరిగింది.

మంగళవారం జరిగిన ఈ సంఘటనకు ఎవరు బాధ్యులనేది ఇంకా తెలియరాలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. సంఘటన జరిగిన ప్రాంతానికి అతి సమీపంలో పాక్ ప్రధాని యూసుఫ్ రజా గిలానీ, హోం శాఖామంత్రి మహమూద్ ఖురేషీ గృహాలుండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి