కాబుల్‌లో దాడులకు పాల్పడింది మేమే: తాలిబన్లు

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే సిటీ సెంటర్‌లోనున్న భారతదేశపు దౌత్య కార్యాలయం వద్ద గురువారం ఉదయం పేలుళ్ళు జరిగిన విషయం విదితమే. ఈ దాడులను తామే చేసామని తాలిబన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబుల్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే సిటీ సెంటర్‌లోనున్న భారతదేశపు దౌత్య కార్యాలయం వద్ద గురువారం ఉదయం పేలుళ్ళు జరగడంతో 12 మంది మృతి చెందగా 80 మందికిపైగా తీవ్ర గాయాల పాలైనారు. ఈ దాడులను తామే చేసామని తాలిబన్ తన వెబ్‌సైట్లో వివరించింది.

గురువారం జరిగిన దాడుల్లో భారతదేశపు దౌత్యకార్యాలమే వారి లక్ష్యంగా పేలుళ్ళు జరిగాయని, ఇందులో ఐటీబీపీకి చెందిన ముగ్గురు సైనికులు కూడా గాయాలపాలైనారని భారతదేశపు విదేశాంగ కార్యదర్శి నిరుపమారావు తెలిపారు.

ఇదిలావుండగా అక్కడ జరిగిన పేలుడు కారణంగా ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు చుట్టుప్రక్కల భవనాలలోని కిటికీలు, తలుపులు పాక్షికంగా దెబ్బతిన్నాయని, చాలా దూరం వరకు పొగ వ్యాపించిందని తెలిపారు. నిరుడు జులై నెలలో భారత దౌత్య కార్యాలయంపైనే దాడులకు పాల్పడి పేలుళ్ళు జరిగాయి. ఇందులో భద్రతాదళానికి చెందిన ప్రముఖ అధికారి ఒకరు మృత్యువాత పడ్డారు.

కాగా ఈ ఏడాది ఆగస్టు నెల 20వ తేదీన అధ్యక్షుని ఎన్నికలు జరిగిన తర్వాత రాజధాని కాబుల్‌లో ఇది నాల్గవ బాంబు దాడి.

ఇటీవలే సెప్టెంబర్ 17న కాబుల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళే మార్గంలో సైనిక స్థావరాలపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఆరుగురు సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్ర గాయాల పాలైనారు. ఈ దాడులకన్నింటికీ తాలిబన్ సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి