థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ ఆస్పత్రిపాలు

థాయ్‌లాండ్ రాజు భూమిబోల్ అడుల్యాదెజ్ (81) జ్వరం, నీరసంతో ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు థాయ్‌లాండ్ రాజ మందిరం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సిఫార్సు మేరకు శనివారం రాత్రి అస్వస్థత కారణంగా రాజు భూమిబోల్‌ను సిరిరాజ్ ఆస్పత్రికి తరలించామని రాయల్ హోల్‌హోల్డ్ బ్యూరో వెల్లడించింది.

రాజు భూమిబోల్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని థాయ్ ప్రధానమంత్రి అభిసిత్ వెజ్జజివా విలేకరులతో చెప్పారు. రాజు ఆరోగ్యం థాయ్‌‍లాండ్ రాచరిక వ్యవస్థకు ఎంతో కీలకం. ఎందుకంటే భూమిబోల్ వారసుడికి రాచరిక పగ్గాలు చేతికందడం అంత సులభంగా జరగకపోవచ్చు.

భూమిబోల్ కుమారుడు, యువరాజు విజిరాలోంగ్‌కోర్న్ ఇప్పటివరకు రాచరిక వారసత్వాన్ని పొందే అధికారం దక్కించుకోలేదు. అక్టోబరు 2007లో భూమిబోల్ స్వల్ప గుండెపోటుతో బాధపడ్డారు. గత ఏడాది ఆయన సాంప్రదాయ పుట్టినరోజు ప్రసంగం కూడా చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన మరోసారి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరడం ఆందోళన కలిగిస్తోంది.

వెబ్దునియా పై చదవండి