దక్షిణాసియా శాంతికి కాశ్మీర్ సమస్యే పరిష్కారం: గిలానీ

శుక్రవారం, 9 అక్టోబరు 2009 (10:03 IST)
దక్షిణాసియాలో శాంతి స్థాపన జరగాలంటే వివాదాస్పద కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించాలని పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ అభిప్రాయపడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ రాజధాని ముజఫరా‌బాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ ప్రాంతంలో 2005లో వచ్చి భూకంపం వల్ల అనేక వందల మంది మృత్యువాత పడిన విషయం ఇంకా గుర్తుందన్నారు. ఈ ప్రాంతంలోనే కాకుండా, దక్షిణాసియాలో శాంతి నెలకొనాలంటే వివాదాస్పద కాశ్మీర్ సమస్యకు పరిష్కారమార్గం కనుగొనాలని సూచించారు. ఈ అంశంలో అధికార పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ స్పష్టమైన విదేశాంగ విధానం అమలుకు కృషి చేస్తోందన్నారు.

అంతేకాకుండా, కాశ్మీర్ ప్రజలకు రాజకీయ, నైతిక, దౌత్యపరమైన మద్దతును ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన ప్రకటించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌, జమ్మూకాశ్మీర్‌లలో నివశించే ప్రజలను వేరుచేయలేమన్నారు. మనమంతా ఒక్కటేనని ఆయన గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి