నేపాల్ నూతన ప్రధానిగా మావో నాయకుడు భట్టారాయ్

సోమవారం, 29 ఆగస్టు 2011 (09:16 IST)
మావోయిస్ట్ నాయకుడు డాక్టర్ బాబూరామ్ భట్టారాయ్ ఆదివారం నేపాల్ నూతన ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. తెరాయ్ ప్రాంత మాధేశీ అలయెన్స్ నుంచి కీలక మద్దతు లభించడంతో ఈ మాజీ తిరుగుబాటు నాయకుడు నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన తన ప్రత్యర్ధి ఆర్‌సీ పౌద్యాల్‌ను ఓడించారు.

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పొందిన 57 ఏళ్ల భట్టారాయ్‌కి 340 ఓట్లు లభించగా నేపాలీ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు పౌద్యాల్‌ 235 ఓట్లు పొందారు. అసెంబ్లీలో నాలుగో అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించిన మాధేశీ పార్టీల అలయెన్స్ యునైటెడ్ డెమోక్రటిక్ మాధేశీ ఫ్రంట్‌ భట్టారాయ్‌కు మద్దతిచ్చింది. 2008లో మావోయిస్ట్ ఛైర్మన్ ప్రచండ నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో భట్టారాయ్ ఉపప్రధాని, ఆర్థికమంత్రిగా ఉన్నారు. నేపాల్ అసెంబ్లీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేదు.

వెబ్దునియా పై చదవండి