పాక్‌లో ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నం

పాకిస్థాన్‌లోని అనేక సంఘసేవా సంస్థలు (ఛారిటీలు) ఉగ్రవాద సంస్థలకు నిధులు మళ్లించే మార్గంగా ఉపయోగపడుతున్నాయని, అంతేకాకుండా వాటికి ప్రత్యక్ష మద్దతు ఇస్తున్నాయని అమెరికా ఆరోపించింది. అమెరికా ఆర్థిక శాఖలో ఉగ్రవాద సంస్థలకు నిధుల మళ్లింపు మార్గాలను పరిశీలించే ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లోని అనేక ఛారిటీలు ఉగ్రవాద సంస్థలకు నిధులు మళ్లించేందుకు హవాలా నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్నాయని, అందువలన ఈ పరిస్థితి భారత్‌తోపాటు, మిగిలిన దేశాలన్నింటికీ పెను సవాలుగా మారిందన్నారు.

హింసాత్మక అతివాద ఉద్యమాలు నడుపుతున్న వర్గాలచే పాకిస్థాన్‌లో సంఘ సేవ చేస్తున్న ఛారిటీలు నడుపబడుతున్నాయి. అతివాద వర్గాలు పాక్‌లో ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేసే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

దీనిలో ఛారిటీలు చాలా ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని అమెరికా ఆర్థిక శాఖ తాత్కాలిక సహాయ కార్యదర్శి (ఉగ్రవాద ఫైనాన్సింగ్) డేనియల్ గ్లాసెర్ ఇటీవల న్యూఢిల్లీ వచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ ఛారిటీలు హవాలా మార్గం ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు మళ్లిస్తుండటం, భారత్‌తోపాటు, ప్రపంచదేశాలన్నింటికీ ఎంతో ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా పాక్‌లోని అనేక ఉగ్రవాద సంస్థలను తమను తాము ఛారిటీలుగా బహిరంగంగా ప్రకటించుకుంటున్నాయి.

నిధులు పెంచుకునేందుకు, తరలించేందుకు ఉగ్రవాద సంస్థలు ఇలా చేస్తున్నాయన్నారు. అంతేకాకుండా ఇటువంటి ఛారిటీలు ప్రమాదకర అతివాద ఉద్యమాలకు మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి