పుకార్లతో సయీద్‌పై చర్యలు తీసుకోలేం: పాక్

పుకార్లను ఆధారంగా చేసుకొని నిషేధిత తీవ్రవాద సంస్థ జమాదుత్ దవా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయీద్‌పై తాము చర్యలు తీసుకోలేమని పాకిస్థాన్ ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. ముంబయి ఉగ్రవాద దాడులకు సయీద్ ప్రధాన సూత్రధారి అని భారత్ బలంగా విశ్వసిస్తున్న సంగతి తెలిసిందే.

అక్కడిక్కడా వినిపించే మాటలను ఆధారంగా చేసుకొని అతనిపై పాక్ చర్యలు తీసుకోలేదని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహమాన్ మాలిక్ తెలిపారు. ముంబయి ఉగ్రవాద దాడులతో సయీద్ సంబంధాలను వివరిస్తూ భారత్ పంపిన సమాచారాన్ని విశ్లేషించేందుకు తమకు మరింత సమయం కావాలన్నారు.

భారత్ ముంబయి దాడులకు సంబంధించి పది రోజుల క్రితమే తాజా సాక్ష్యాధారాలు పంపించింది. వీటిని పరిశీలించేందుకు తమకు మరికొన్ని రోజులు కావాలి. ఈ సాక్ష్యాధారాలు తమ కోర్టుల్లో చెల్లుబాటు అవతాయో లేదో తెలుసుకోవాలి. పుకార్లతో చర్యలు తీసుకోలేమని మాలిక్ ది న్యూస్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇదిలా ఉంటే ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యకార్యాలయ వర్గాలు ముంబయి దాడుల్లో సయీద్ ప్రమేయానికి సంబంధించి ఆగస్టు 21న తాజా సాక్ష్యాధారాలను పాక్ ప్రభుత్వానికి అందజేశామని తెలిపాయి. ఆ తరువాత మళ్లీ ఎటువంటి సమాచారాన్ని పాక్‌కు అందజేయలేదని దౌత్యవర్గాలు వెల్లడించాయి.

పాకిస్థాన్ ప్రభుత్వం సయీద్‌పై చర్యల విషయంలో జాప్యం చేస్తుండటంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీనిపై మాలిక్ తాజాగా మాట్లాడుతూ.. మేము మీ కోర్టులను గౌరవిస్తున్నాము. మీరు కూడా మా కోర్టులను గౌరవించాలని మాలిక్ భారత్‌ను కోరారు. పరస్పర ఆరోపణల పర్వానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

వెబ్దునియా పై చదవండి